Idream media
Idream media
కరోనా విపత్తు వేళ ప్రభుత్వపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు సహాయం చేస్తున్నారు. మేమున్నామనీ.. మీకేం కాదనే భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను క్షేత్రస్థాయిలో బాధితులకు చేరుతున్నాయో, లేదో చూడడమే కాదు.. అవసరమైతే వారే వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో పాటుగా, అధికార పార్టీ నేతలు సేవలకు ముందుకు కదలాలని వైసీపీ అధినాయకత్వం సూచించింది. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తూ.. మరోవైపు వ్యాక్సినేషన్, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తూ కరోనాపై ప్రభుత్వం యుద్ధం చేస్తున్న క్రమంలో, సైనికులుగా పార్టీ నాయకులు రంగంలోకి దిగాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొవిడ్ బారిన పడిన రోగులకు, ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అండగా నిలుస్తూ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలంతా పాటించేలా వారిని చైతన్యవంతం చేయడంతో పాటు రోగులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు కృషి చేస్తున్నారు. కొవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయో లేదా అని పర్యవేక్షిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ప్రజలకు సేవలు అందుతున్నాయి. 9143 54 1234, 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నెంబర్ల లో పార్టీ నాయకులు అందుబాటులో ఉంటున్నారు. స్థానికంగా కొవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి రూ.25 లక్షల సొంత నిధులతో చంద్రగిరి ప్రభుత్వాస్పత్రిలో వంద, నారావారిపల్లెలోని ప్రభుత్వాస్పత్రిలో 50 చొప్పున 150 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయించారు. చంద్రగిరి లో 100 బెడ్లు, నారావారి పల్లెలో 50 ఆక్సిజన్ బెడ్లు సిద్దం చేసారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లు సిద్ధం చేశారు. కొవిడ్‌కు అవసరమైన మందులు సులభంగా లభించేలా నియోజకవర్గంలో ఏడు చోట్ల మందుల షాపులు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే, ఆక్సిన్ కొరత నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం చాటుకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వంశీ చేయూతనందించారు. రూ.30 లక్షల విలువైన 70 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేశారు. చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ కోవిడ్ ఆస్పత్రికి వీటిని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు.