Idream media
Idream media
నగరి రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూయడంతో టీడీపీ ఆ స్థానాన్ని ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌కు ఇచ్చింది. అప్పటి నుంచీ భానుప్రకాష్ నియోజకవర్గంలో పట్టుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తండ్రి రాజకీయాలు అంతగా వంటపట్టని భాను ప్రకాష్ నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రోజాపై దుష్ప్రచారాలు చేస్తూ ఆమెను ప్రజలకు దూరం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా భానుప్రకాష్‌పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ జాగ్రత్తగా మాట్లాడాలని పేర్కొన్నారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నానని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని గాలి భానుపై సెటైర్లు వేశారు.
నగరిలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటా ఉందంటూ ఇటీవల గాలి భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అండతో నగరి సంపదను కొల్లగొడుతున్నారని.. ఆంబోతుల్లా నగరి మీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. గ్రావెల్ దోపిడీకి ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని.. నాడు తన తండ్రి ముద్దుకృష్ణమ చెన్నైకు మట్టి తరలిపోకుండా చర్యలు తీసుకుంటే.. నేడు ఎమ్మెల్యే రోజా మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చారని గాలి భానుప్రకాష్ విమర్శించారు. ఈ క్రమంలోనే రోజా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. వైసీపీ పెట్టకముందు నుంచే తాను జగన్ వెంట ఉన్నానని ఆమె తెలిపారు. తనపై జరుగుతున్నవి దుష్ప్రచారాలేనని రోజా కొట్టిపారేశారు. కాగా నగరిలో రోజా ప్రత్యర్థులకు ఇటీవల కాలంలో నామినేట్ పదవులు దక్కాయి. తన వర్గం వారికి పదవులు దక్కకపోవడంపై రోజా అసంతృప్తిగా ఉన్నారని, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన రోజా తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు. కావాలనే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని రోజా పేర్కొన్నారు.