లాక్ డౌన్ ఉల్లంఘన పై కేసు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఆపత్కాలంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. లాక్ డౌన్లోడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు.

కరోనా వైరస్ కట్టడి, గ్రామాల్లో ప్రజలకు అందించే సహాయ సహకారాలు పై నిన్న శుక్రవారం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వాలంటీర్ల తో సమావేశం అయ్యారు. అనంతరం వారికి కరోనా రక్షణ సామాగ్రి అందజేశారు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారీ సంఖ్యలో వాలంటీర్లు హాజరుకావడంతో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అయింది. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన తో పాటు మరో ఏడుగురు పై కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. తన అనుచరులతో కలిసి ఈరోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ తనకు సమాధానం చెప్పాలని ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

తాను చేస్తున్న సేవా కార్యక్రమాలపై సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కళ్ళం, ఎంపీ విజయసాయిరెడ్డి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి లతో మాట్లాడుతున్నానని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. తాను వాలంటీర్ల తో సమావేశం అవ్వడం తప్పయితే ఎస్పీ తనకు చెప్పాలని ఆయన అన్నారు. అలాకాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ స్థానిక పోలీసులను సస్పెండ్ చేస్తామని ఎస్పీ హెచ్చరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎస్పీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రసన్నకుమార్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. కేసు నమోదు చేయడంపై ఎస్పీ వచ్చి సమాధానం చెప్పే వరకు తాను స్టేషన్ నుంచి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Show comments