iDreamPost
android-app
ios-app

kuppam municipality results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ

kuppam municipality results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ

చంద్రబాబు కంచుకోట బద్ధలైంది. ఏడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఘోర ఓటమిని మూటకట్టుకుంది. అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు పార్టీని తన సొంత నియోజకవర్గంలోనే ఓడించి చరిత్ర సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సంపూర్ణం చేసుకుంది. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో ఘన విజయాలు సాధించిన వైసీపీ.. కుప్పం మున్సిపాలిటీలోనూ జెండా ఎగురవేసి.. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 25 వార్డులకు గాను వైసీపీ 19 వార్డుల్లో విజయం సాధించి కుప్పం మున్సిపాలిటీలో తొలిపాలకవర్గం ఏర్పాటు చేయబోతోంది. టీడీపీ కేవలం 6 వార్డులకే పరిమితమైంది. 25 డివిజన్లకుగాను ఒక డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడంతో.. అది వైసీపీకి ఏకగ్రీవమైంది. మిగిలిన 24 డివిజన్లకు పోలింగ్‌ జరగ్గా.. వైసీపీ 18, టీడీపీ ఆరు డివిజన్లను గెలుచుకుంది. మొత్తంగా నాలుగింట మూడో వంతు వార్డులను వైసీపీ గెలుచుకుని తన సత్తాను చాటింది.

Also Read : YCP, Nellore Corporation – సింహపురిలో జూలువిదిల్చిన వైసీపీ.. పత్తాలేకుండా పోయిన టీడీపీ

హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రత్యేక పరిశీలకులు ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో సాగింది. కౌంటింగ్‌ ప్రక్రియ అంతా వీడియో రికార్డు చేశారు. ఆ ఫుటేజీని ఎన్నికల సంఘం హైకోర్టుకు అందజేయనుంది.

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీ, వైసీపీకి అన్నట్లుగా కాకుండా.. చంద్రబాబుకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య జరిగినట్లుగా ముందు నుంచి పరిణామాలు నెలకొన్నాయి. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల తర్వాత.. చంద్రబాబు పెద్దిరెడ్డిని ఉద్దేశించి.. ‘పెద్దిరెడ్డి ఏం పెద్ద పుడింగా’ అంటూ మాట్లాడారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్‌.. పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఏకవచనంతో అమర్యాదగా మాట్లాడారు. వీటన్నింటికీ పెద్దిరెడ్డి కుప్పం ఫలితంతో సమాధానం చెప్పారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పెద్దిరెడ్డి తన భుజస్కంధాలపై వేసుకుని చంద్రబాబు పతనానికి నాంధి పలికారు.

ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేసేందుకు, ప్రచారం చేసేందుకు కూడా రానీ చంద్రబాబును.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో 25 వార్డుల్లో తిరిగే పరిస్థితిని పెద్దిరెడ్డి తెచ్చారు. రెండు రోజుల పాటు అర్థరాత్రి వరకు చంద్రబాబు.. కుప్పం వీధుల్లో తిరిగారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లారు. రోడ్డు ర్యాలీలతో వాహనంపై నుంచి చంద్రబాబు ప్రజలకు ఒంగి ఒంగి దండాలు పెట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా.. అని ప్రచారంలో లోకేష్‌ చెప్పగా.. అది నిజం కాదని కుప్పం ప్రజలు తమ ఓటుతో చెప్పారు.

Also Read : Peddireddy, Kuppam Municipality Results – చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు.. పుంగనూరులో పోటీ చేయాలని ఆహ్వానం