Idream media
Idream media
ఎన్నిక ఏదైనా.. అధికార వైసీపీనే విజయం వరిస్తోంది. బుధవారం వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన వైసీపీ.. ఈ రోజు వెలువడుతున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
176 ఎంపీటీసీ, 14 జెడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 50 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 126 ఎంపీటీసీ స్థానాల్లో మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 123 ఎంపీటీసీ, పది జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. పోలింగ్ జరిగిన 10 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఇప్పటి వరకు వైసీపీ మూడు చోట్ల విజయం సాధించింది. ఏకగ్రీవమైన వాటితో ఈ సంఖ్య 7కు చేరుకుంది. పోలింగ్ జరిగిన 123 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఇప్పటి వరకు 72 చోట్ల విజయం సాధించగా.. టీడీపీ 8 చోట్ల, జనసేన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక 3వ ఎంపీటీసీ స్థానంలో గెలుపొందింది. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాలతో వైసీపీ 122 చోట్ల విజయం సాధించింది. సాయంత్రం నాలుగు గంటల లోపు పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read : Municipal Elections – ఎవరు ఎక్కడ గెలిచారంటే..