iDreamPost
android-app
ios-app

Botsa Satyanarayana, Kadiri Baburao – వియ్యంకులు కాబోతున్న సీనియర్‌ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

Botsa Satyanarayana, Kadiri Baburao – వియ్యంకులు కాబోతున్న సీనియర్‌ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు అధికార వైసీపీ నేతలు వియ్యంకులు కాబోతున్నారు. సీనియర్‌ నేత, మంత్రి బోత్స సత్యనారాయణ, ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులు వియ్యంకులు అయ్యేందుకు సిద్ధమయ్యారు. బోత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్‌ సందీప్, కదిరి బాబూరావు తమ్ముడు బాలకృష్ణ కుమార్తె పూజితలకు వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది.

బోత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌ అకాల మరణం తర్వాత.. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన నేతల్లో బోత్స కూడా ఒకరు. కిరణ్‌కుమార్‌ రెడ్డితో పోటా పోటీగా ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదిపారు. 2011 నుంచి 2014 వరకు పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు.

కదిరి బాబూరావు టీడీపీ నుంచి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన కదిరి బాబూరావు.. 2004లో తొలిసారి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సినీ నటుడు బాలకృష్ణతో ఉన్న స్నేహం ఆయనకు రాజకీయంగా కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే 2009లో మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డితో పోటీ పడి.. కనిగిరి టీడీపీ టిక్కెట్‌ తెచ్చుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన నామినేషన్‌ పరిశీలనలో చెల్లకుండా పోయింది. 2014లో మరోసారి కనిగిరి నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో అయిష్టంగానే దర్శికి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఇప్పుడు.. వైసీపీ ముఖ్యనేతలలో ఒకరు, సీనియర్‌ మంత్రి అయిన బోత్స సత్యనారాయణ కుమారుడికి తమ్ముడు బాలకృష్ణ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం ద్వారా వియ్యం అందుకుంటున్నారు.

ఇప్పటికే కదిరి బాబూరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వియ్యంకులు. టీడీపీ ఉండగానే.. రామచంద్రయ్యతో వియ్యం అందుకున్నారు. టీడీపీ నేతగా ఉన్న రామచంద్రయ్య.. పీఆర్‌పీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. పీఆర్‌పీ తరఫున.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన రామచంద్రయ్య.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొత్తం మీద కదిరి బాబూరావు.. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంత నేతలతో వియ్యం అందుకున్న నేతగా పేరొందారు.

గత నెలలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వియ్యంకులుగా మారారు. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లు వియ్యం అందుకున్నారు. కొలుసు కుమారుడికి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు వైసీపీ నేతలు వియ్యంకులు అవుతున్నారు. వైసీపీలోని ఇద్దరు సీనియర్‌ నేతలైన కొలుసు, బోత్సలు.. కనిగిరి తాజా, మాజీ ఎమ్మెల్యేలతో వియ్యం అందుకోవడం విశేషం.

Also Read : వియ్యంకులు కాబోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు