Idream media
Idream media
మహమ్మారి కరోనా వైరస్ మరో వైసీపీ నేతను బలితీసుకుంది. కర్నూలు జిల్లా నేత యర్రబోతుల వెంకట రెడ్డి కరోనాతో ఈ రోజు బుధవారం మరణించారు. మూడు వారాల క్రితం వైరస్ సోకగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వస్తున్నారని కుటుంబ సభ్యులు, అనుచరులు ఆనందంతో ఉండగా.. గుండెపోటు ఆయన్ను బలితీసుకుంది. స్వగ్రామం కొలిమిగుండ్లలో ఈ సాయంత్రం వెంకట రెడ్డి అంత్యక్రియలు జరిగాయి.
ఎమ్మెల్యే పదవికి రెండు సార్లు పోటీ..
దాదాపు 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న యర్రబోతుల వెంకటరెడ్డి 2004లో సొంత నియోజకవర్గం కోయిలకుంట్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా రామకృష్ణారెడ్డి చేతిలో మూడు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. నియోజకవర్గాల పునర్విభజనలో కోయిలకుంట్ల నియోజకవర్గం రద్దయి.. బనగానపల్లి నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లోనూ మరోసారి టీడీపీ అభ్యర్థిగా యర్రబోతుల వెంకటరెడ్డి పోటీ చేశారు. త్రిముఖ పోరులో ప్రజా రాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో చల్లా రామకృష్ణారెడ్డి రెండు, యర్రబోతుల మూడో స్థానంలో నిలిచారు.
జగన్‌తో సన్నిహిత్యం..
వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ యర్రబోతుల ఆయన వెంట నడిచారు. జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా పలుమార్లు కలిశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి మద్ధతుగా నిలిచారు. 2019 ఎన్నికలకు ముందు ఆయనకు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినా.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి మద్ధతు అవసరం అని ఆయన పేరు సూచించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో యర్రబోతులకు బంధుత్వం ఉంది. రామిరెడ్డి చిన్నాన కుమారుడుకు యర్రబోతుల వెంకటరెడ్డి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు.
జడ్పీ పీఠం ఎక్కేలోపు..
ఇటీవల ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు వైసీపీ జడ్పీ చైర్మన్ ముందు జనరల్ మహిళలకు రిజర్వ్ కాగా, తర్వాత పరిణామాల్లో జనరల్‌కు మారడంతో యర్రబోతులకు అవకాశం లభించింది. తన సొంత మండలం కొమిలిగుండ్ల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విజయం లాంఛనమే కావడంతో.. తొలిసారి జిల్లా స్థాయి పదవి చేపట్టబోయే సమయంలో కరోనా యర్రబోతులను బలితీసుకోవడం ఆయన అనుచరుల్లో విషాదం నింపింది.