Idream media
Idream media
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తీర్పు నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. సమావేశం తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. సుప్రిం తీర్పు, పంచాయతీ ఎన్నికలు, కరోనా వైరస్, వ్యాక్సినేషన్ ప్రక్రియలపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండూ సాధ్యం కాదు..
పంచాయతీ ఎన్నికలపై సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పున గౌరవిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సజ్జల వివరించారు. వ్యాక్సిన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణ రెండూ ఒకే సారి నిర్వహించడం సాధ్యం కాదని ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితిని వివరించారు.
ఎస్‌ఈసీదే బాధ్యత..
ఎన్నికలకు వైసీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో తమ ఆరాటం ప్రజా ఆరోగ్యం కోసమేనని పునరుద్ఘాటించారు. ఎవరిపైనా పై చేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదన్నారు. తమకు ఎలాంటి ఇగో సమస్యలు లేవన్నారు. ఎన్నికలు నిర్వహించితీరాలన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరు వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వల్ల మళ్లీ కరోనా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ తర్వాత కరోనా పెరిగితే దానికి ఎస్‌ఈసీదే బాధ్యతని స్పష్టం చేశారు.