Idream media
Idream media
కరోనా వైరస్ మృత్యుకేళి కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా వైరస్‌కు బలవుతున్నారు. తాజాగా మరో వైసీపీ నేతను మహమ్మారి బలితీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిందిగుదిటి మోహన్ కరోనా సోకి మరణించారు. గత కొన్ని రోజులుగా వైరస్‌తో బాధపడుతున్న మోహన్.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
కొన్ని రోజులు కిత్రం మోహన్ కుటుంబ సభ్యులు వైరస్‌బారిన పడ్డారు. మోహన్‌కు వైరస్ సోకకపోవడంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయనలోనూ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే వైరస్ సోకిన ప్రారంభంలో హోం ఐసోలేషన్‌లోనే ఉండడం నష్టం చేకూర్చింది. పరిస్థితి దిగజారడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేశారు. అయినా ఆరోగ్యం కుదటపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్‌లు మోహన్‌ను హైదరాబాద్ తరలించారు. శ్వాసకోశ సమస్యలు ఉండడంతో మోహన్ కరోనా వైరస్ నుంచి కోలుకోలేకపోయారు.
కాపు సామాజికవర్గానికి చెందిన మిందిగుదిటి మోహన్ దాదాపు మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీలో ఆయన రాజకీయ జీవితం సాగింది. తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పి.గన్నవరంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విజయంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మోహన్‌కు నామినేటెడ్ పదవి లభిస్తుందని అందరూ భావించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని మోహన్ ఆశించారు. అయితే ఆ పదవి దక్కలేదు. పదవి వచ్చినా, రాకపోయినా పార్టీ కోసం పని చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఇంతలోనే ఆయన్ను కరోనా బలితీసుకోవడం తూర్పుగోదావరి వైసీపీ శ్రేణుల్లో విషాదం నింపింది.
Also Read : ఎమ్మెల్యే మద్ధాళి గిరికి పదవీ గండం ఉందా..?