iDreamPost
android-app
ios-app

నందికొట్కూరు వైసిపి కథ సుఖాంతం

నందికొట్కూరు వైసిపి కథ సుఖాంతం

గత కొంతకాలం గా నందికొట్కూరు వైసిపిలో ఎమ్మెల్యే ఆర్ధర్, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఈ పంచాయితీ పలుమార్లు పార్టీ అధిష్టానం వద్దకు కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి ఈ రెండు వర్గాల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమనడంతో పార్టీ అధిష్టానం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్ధర్ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆర్ధర్ మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నాడని తెలియడంతో ఈరోజు ఉదయం నుండి ఒక వర్గం మీడియాలో ఆర్ధర్ ఈరోజు తన పదవికి రాజీనామా చేయబోతున్నాడని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ముందుగా ప్రకటించిన విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆర్థర్ ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యమని.. నందికొట్కూరు నియోజక వర్గంలో ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనుచరులకు మార్కెట్ కమిటీ పదవులు రాలేదని మనస్తాపానికి గురైన మాట వాస్తవమేనని, అయితే పదవులనేవి అందరికి ఒకేసారి ఇవ్వలేరని, కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్ధానాల్లో గెలుపొంది ముఖమంత్రికి కానుకగా ఇస్తాం అని ఆర్థర్ స్పష్టం చేశారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జిల్లాలో అడుగు పెట్టనీయమని మాట్లాడింది తన అనుచరులు కారని, బయట వ్యక్తులని వారితో తనకెటువంటి సంబంధం లేదని ఆర్ధర్ స్పష్టం చేశారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడినైనా తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఆహ్వానం అందలేదని, చైర్మన్ ప్రమాణ స్వీకారం గురించి సమాచారం ఇవ్వని అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని బైరెడ్డిని నేను ఎప్పుడూ విమర్శించలేదని ఆర్థర్ తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే చేసిన ఈ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో నందికొట్కూరు వైసిపి వర్గ పోరుకు తాత్కాలికంగా తెరపడింది చెప్పవచ్చు.