iDreamPost
android-app
ios-app

మరో ‘నేస్తం’కు శ్రీకారం..? మంత్రివర్గంలో చర్చ..

మరో ‘నేస్తం’కు శ్రీకారం..? మంత్రివర్గంలో చర్చ..

వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పరిపాలనలో మరో పథకం చేరడం దాదాపు ఖాయమైంది. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా పరిపాలనలో విప్లవాత్మక చర్యలు, వినూత్నమైన సంక్షేమ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాలతో లబ్ధిదారులకు నేరుగా నగదును అందజేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను కొత్త పుంతలను తొక్కించింది.

ఈ పథకాల సరసన మరో నూతన పథకం చేరబోతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే గాక, ప్రజల అవసరాలు, అభీష్టాల మేరకు నూతన పథకాలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే వచ్చే మూడేళ్లలో ఈబీసీ నేస్తం అనే పేరుతో నూతన పథకం తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు)లకు ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈబీసీల్లోని 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తింపజేయాలని యోచిస్తున్నారు.

ఇప్పటికే వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏడాదికి 18,750 చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయలు అందించాలని నిర్ణయించారు. మొదటి దఫా 18,750 మొత్తాన్ని లబ్ధిదారులకు అందించారు. కాపు నేస్తం కింద కాపుల్లోని 45– 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల చొప్పున 75 వేల రూపాయలు ఇవ్వాలని సంకల్పించారు. మొదటి ఏడాదిలోనే 15 వేల రూపాయలు లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు. ఈ తరహాలోనే ఈబీసీలకు మూడేళ్లకు ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేసేలా పథకం రూపాందించారు. ఈ పథకం ద్వారా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేల రూపాయలు అందించనున్నారు.

ఈ పథకంపై ఈ రోజు మంత్రివర్గం చర్చిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభమైన ఏపీ మంత్రివర్గం పలు అంశాలపై చర్చిస్తోంది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ పథకం ప్రారంభం లాంఛనం కానుంది. ఈ పథకంతోపాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం, రాజధానిలో అసంపూర్తి భవనాల పూర్తి, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపై కూడా మంత్రివర్గం చర్చిస్తోంది.