Idream media
Idream media
సొంత ఇల్లు పేద, మధ్యతరగతి వారి చిరకాల కల. ఆ కలను సాకారం చేసే బాధ్యతను సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకున్నారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామాలు, పట్టణాలలోని పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఒకే దఫాలో కేటాయించి దేశం దృష్టిని ఆకర్షించారు. ఇంటి స్థలం కోసం కాళ్లు అరిగేలా ఇన్నాళ్లు తిరిగిన వారికి.. వాలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దకే ఇళ్ల పట్టా వచ్చి చేరింది. మధ్యవర్తులు, దళారులు దందా లేకుండా, లంచాలకు తావు లేకుండా, రాజకీయ నేతల సిఫార్సులతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం దక్కింది. పట్టణ ప్రాంతాలలో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర సెంటు చొప్పన పేదలకు ప్రభుత్వం ఉచితంగా స్థలం కేటాయించి.. వారి చిరకాల కలను సాకారం చేసింది.
మధ్యతరగతి వారి కోసం..
పేదల సొంత ఇంటి కలను తీర్చిన వైఎస్ జగన్.. ఇప్పుడు మధ్యతరగతి వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్.. ఈ ప్రక్రియలో భాగంగా మరో ముందడుగు వేశారు. మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పట్టణాల సమీపంలో గతంలో వివిధ ప్రభుత్వ సంస్థలకు కేటాయించి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖలు తమ పరిధిలోని భూముల వివరాలను కలెక్టర్లకు తెలియజేయాలి. కలెక్టర్లు ఆయా భూములను మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు అందించాలి. ఆ భూములను లే అవుట్ల అభివృద్ధి చేసి మధ్యతరగతి వారికి 200– 240 గజాల చొప్పన కనీస ధరకు ప్రభుత్వం అందిస్తుంది.
వివాదాలు రాకుండా జాగ్రత్తలు..
మధ్యతరగతి వారికి ఇచ్చే ఇళ్ల స్థలాలు వివాదరహితంగా ఉండేలా జగన్ సర్కార్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వ శాఖలకు కేటాయించిన స్థలాల తీసుకునే క్రమంలో కొన్నింటిని మినహాయించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాల కోసం తీసుకోకూడదని నిర్ణయించారు. వీటితోపాటు విద్యాశాఖ, ప్రభుత్వ విద్యా సంస్థలు, వక్ఫ్, ఇతర ధార్మిక సంస్థల భూములు, పర్యావరణ సమతుల్యతను కాపాడే భూములు, చెరువులు, కాలువలు, నీటి వనరులు ఉన్న భూములు, కమ్యూనిటీ పోరంబోకు భూములు, ఎల్తైన కొండ ప్రాంత భూములు సహా అభ్యంతరకరమైన భూముల తీసుకోకూడదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇళ్ల స్థలాల పథకం విజయవంతంగా సాగేందుకు, కోర్టు వివాదాలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు వహిస్తోంది. భూముల గుర్తింపు తర్వాత.. అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి నూతన ఏడాది ప్రారంభంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.