Idream media
Idream media
గోరింతను కొండతగా చెబుతూ అప్పుల విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు ఇప్పటి వరకు టీడీపీ నేతలు చేసిన ప్రచారం అంతా అబ్ధమని తేలిపోయింది. చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలందరూ ఏపీ అప్పులపై తిమ్మిని బమ్మిని చేయాలని తమకున్న మీడియా బలంతో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తరచూ మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తూ.. ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని, రాష్ట్రం దివాళాతీస్తోందంటూ రకరకాల అంకెలతో గారడి చేశారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఏడాది నుంచే అప్పులపై అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదొవ పట్టించారు యనమల రామకృష్ణుడు.
గత ఏడాది జూన్‌లో జగన్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పులపై మాట్లాడిన యనమల రామకృష్ణుడు ఏడాదికే జగన్ సర్కార్ 60 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఐదేళ్లలో 3.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయబోతోందని తన మేథాశక్తిని ఉపయోగించి లెక్కలు వేసి చెప్పారు. సీనియర్‌నేత, పైగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి కావడంతో యనమల చెప్పింది నిజమేమోననే భావన కొంత మందిలోనైనా కలిగి ఉంటుంది. యనమలతోపాటు టీడీపీ నేతలు చేసిన ప్రకటనలపై ఆ పార్టీ అనుకూల మీడియా ప్రత్యేక చర్చలను చేపడుతూ జగన్ సర్కార్ అప్పులు తెచ్చి పథకాల పేరుతో ప్రజలకు అందిస్తుంది తప్పా మరేమీ చేయడంలేదన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
జగన్ సర్కార్ చేసిన అప్పులపై యనమల ఏడాదిగా చెబుతున్నవన్నీ కూడా అసత్యాలేనని తాజాగా పార్టీ ఎంపీ ద్వారానే వెల్లడైంది. జగన్ సర్కార్ ఇప్పటి వరకు ఎంత అప్పులు చేసిందో తెలపాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సభలో సమాధానం ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 56,076 కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారాడ్ లిఖిత పూర్వకంగా వివరాలు వెల్లడించారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు అన్నీ కూడా 56,076 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాయని మంత్రి తెలిపారు. ఈ వివరాలతో కూడిన ప్రతిని టీడీపీ ఎంపీకి రాజ్యసభ అధికారులు అందించారు. ఏడాదికే జగన్ సర్కార్ 60 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఏం అంటారు..? కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది అబద్ధం, తాను చెప్పిందే నిజమంటారా..?
గురిగింజ తన కింద నలుపు ఎరగదన్నట్లుగా యనమల రామకృష్ణుడు, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం చే సిన అప్పులపై గగ్గొలు పెట్టారు. వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వమే ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయనంత అప్పులు చేసింది. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అప్పుల్లో రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఏపీ వాటాగా 97,123 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. అనుభవజ్ఞనుడు అని చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే.. సంపద పెంచా, ఆదాయం సృష్టించానంటూ ఐదేళ్లు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఏపీ అప్పులను ఐదేళ్లలో 97,123 కోట్ల రూపాయల నుంచి 2,62,225 కోట్ల రూపాయలకు చేర్చారు. దిగిపోతూ మరో 39 వేల కోట్ల రూపాయల బకాయలు పెడింగ్‌లో పెట్టి వెళ్లారు. 1956 నుంచి 2014 వరకు అంటే 58 ఏళ్లలో 13 జిల్లాల అప్పు 97,123 కోట్ల రూపాయలు అయితే.. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్లలో కొత్తగా 1,65,102 కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కొండగా మార్చారు. వివిధ బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయలు 39 వేల కోట్ల రూపాయలు కూడా కలిపితే బాబు ఐదేళ్లలో చేసిన అప్పల లెక్క 2,04,102 కోట్లు అయింది.
వైసీపీ సర్కార్ గడచిన రెండేళ్లలో చేసిన అప్పు 56,076 కోట్ల రూపాయలు. ఈ అప్పు చేయాడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. జగన్ సర్కార్ వచ్చిన 9 నెలలకే కరోనా విరుచుకుపడింది. ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చింది. ప్రజలకే కాదు ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు అప్పులు తప్పక చేశాయి. చేసిన అప్పులను ఎందుకు ఖర్చు పెట్టారో వైసీపీ సర్కార్ లెక్క చెబుతోంది. రెండేళ్ల తమ పరిపాలనా కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు లక్ష కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వైసీపీ సర్కార్ వివరాలు వెల్లడించింది. మరో 30 వేల కోట్ల రూపాయలు పరోక్షంగా వివిధ పథకాల ద్వారా అందించింది. ఇదంతా కేవలం రెండేళ్లలో చేసినదే. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో చేసిన 2,04,102 కోట్ల రూపాయల అప్పులకు లెక్కాపత్రం లేదు. ఇకపై జగన్ సర్కార్ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పే వారంతా ముందుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుంటారా..?
Also Read : చంద్రబాబుకు కుప్పంలో ఎదురు గాలి వీస్తుందా..?