Idream media
Idream media
దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా భారీ ప్లాన్ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 377 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఇందులో ఏపీ నుంచి వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ ఒంటరిపోరునే నమ్ముకుంటున్న వైసీపీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది.
కాంగ్రెస్-వైసీపీ పొత్తు
ఏపీ విభజనతో తెలుగు రాష్ట్రాల్లో పరువు పొగొట్టుకుని దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విభజన తర్వాత తాము జీరోగా మారిన ఏపీలో తిరిగి ఉనికి చాటుకునేందుకు అధికార వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి సూచించారు. దీంతో ఏపీలో కాంగ్రెస్-వైసీపీ పొత్తు పొడుస్తుందా అన్న చర్చ మొదలైంది.
2019 ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందంటూ దూరంపెట్టిన వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ పార్టీని క్షమించేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో యూపీఏలోకి వెళ్లేందుకు కూడా దారులు తెరిచి ఉంచుకున్నారు. ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వస్తోంది.
ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి తమ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి వైసీపీ మద్దతిస్తుందంటూ తమ పార్టీ మనసులో మాట బయటపెట్టేశారు. అంతే కాదు ఇది ముఖ్యమంత్రి జగన్ మాట కూడా అంటూ క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ జగన్ ఇదే మాట చెప్పారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో గెలిచేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకున్న వైసీపీ ఇప్పుడు అదే పీకే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైనా సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే వైసీపీ మద్దతుగా ఉంటుందంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో పీకే తమకు వ్యూహకర్తగా ఉన్నా, లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీకే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు.