iDreamPost
android-app
ios-app

హోదాపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ గర్జన

  • Published Jul 19, 2021 | 1:48 PM Updated Updated Jul 19, 2021 | 1:48 PM
హోదాపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ గర్జన

విభజన గాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ నినదించింది. ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీసింది. విభజన చట్టంలోని పలు ఇతర హామీలను కూడా అమలు చేయడంలేదని విమర్శించింది. పార్లమెంటు సమావేశాల తొలిరోజే ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ ఎంపీలు హోదా అంశాన్ని లేవనెత్తి.. దానిపై చర్చకు గట్టిగా పట్టుబట్టడంతో గందరగోళం చెలరేగి లోకసభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తోంది. పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా మరిసారి హోదాపై తన వైఖరిని స్పష్టం చేసింది.

ఉభయ సభల్లో గందరగోళం.. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదట కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, ఇటీవలి కాలంలో మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు, కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్సార్సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించగా చైర్మన్ వెంకయ్యనాయుడు దాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. అదే సమయంలో ఇతర సభ్యులు పలు అంశాలు ప్రస్తావించడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ సమావేశమైన వెంటనే వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రూల్ 267 కింద హోదాపై చర్చకు నోటీసు ఇచ్చారు. ఏడేళ్ల క్రితం 2014 మార్చి ఒకటో తేదీన నాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీ ఇప్పటికీ అమలు కానందున.. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి మొదట దీనిపైనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read : పని తీరుకు పట్టం.. నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ చైర్మన్ పదవి

అయితే చైర్మన్ తిరస్కరించారు. అందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకుపోయారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మోదీ మౌనంగా ఉండిపోయారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. మరోవైపు లోక్సభలోనూ వైఎస్సార్సీపీ సభ్యులు హోదా అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హోదా కావాలని నినదించడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

హోదా కోసం తొలి నుంచీ పోరాట పంథా.. 

రాష్ట్ర విభజన నాటి నుంచీ వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై పోరాటం సాగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోదీ, చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ప్యాకేజీల పేరుతో మాయ చేశారు. ఆర్థిక సంఘం, నీతిఆయోగ్ వద్దన్నాయన్న సాకుతో హోదా హామీకి నీళ్లొదిలేశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదాపై పట్టు వీడకుండా పోరాటాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనన్న తన వైఖరికి కట్టుబడి ఉంది. పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని నిలదీస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ప్రధాని, ఇతర మంత్రుల వద్ద హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా చలనం లేకవడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే వైఎస్సార్సీపీ ఎంపీలు హోదాపై గట్టిగా నిలదీసి ఉభయ సభలను స్తంభింపజేశారు.

Also Read : ఆ కేంద్రమంత్రి జాతీయతపై వివాదం