Idream media
Idream media
ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడుతుందో.. వచ్చిన తర్వాత.. ఆ అధికారాన్ని నిలుపుకునేందుకు కూడా అంత కన్నా ఎక్కువ కష్టపడాలి. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ఇప్పుడు అదే పని చేస్తోంది. ఓ వైపు అద్భుతమైన సంస్కరణలతో సుపరిపాలన అందిస్తూ.. మరో వైపు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల, సీఎం వైఎస్ జగన్ పట్ల ఏపీ ప్రజలు అత్యంత సానుకూలంగా ఉన్నారని గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసన సభ ఉప ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది.
ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్.. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికలు అంటే.. ఇంకా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇందులో అతి ముఖ్యమైన అంశం అభ్యర్థి. గత ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో నెగ్గింది. జగన్ అనే ఏకైక అజెండాపై ప్రజలు వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. ఈ సారి జగన్ పాలనతోపాటు అభ్యర్థులను బట్టీ ఓట్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయా ఎమ్మెల్యేల పనితీరు గడిచిన రెండున్నరేళ్లలో ఎలా ఉంది..? అనే విషయం తెలుసుకునేందుకు అధికార వైసీపీ సిద్ధమైంది. ఈ మేరకు రెండు రకాలుగా సర్వేలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం ఒక విధానమైతే.. ప్రజలకు ఫోన్ చేసి వివిధ ప్రశ్నలు అడిగి ఎమ్మెల్యేల గురించి తెలుసుకోవడం మరో విధానం. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో రెండు రకాల సర్వేలు మొదలయ్యాయి.
ప్రజలకు ఫోన్ చేస్తున్న వారు.. వివరాలు చెబుతూ.. ఎమ్మెల్యేల గురించి పలు ప్రశ్నలు అడుగుతూ సమాచారం తెలుసుకుంటారు. మీరు చెప్పే విషయాలు సీఎంఓ కార్యాలయానికి పంపిస్తామంటూ చెబుతున్నారు. మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది..? అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా..? అభివృద్ధి పనులు చేస్తున్నారా..? గెలిచిన తర్వాత మీ ఊరికి వచ్చారా..? మీకు అందుబాటులో ఉంటున్నారా..? మీ ఊరిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు..? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటు వైఎస్ జగన్‌పాలన ఎలా ఉంది..? పథకాలు అందుతున్నాయా..? అని కూడా తెలుసుకుంటున్నారు.
Also Read : ఒక పట్టణం, ఓ గ్రామం.. ఆ నియోజకవర్గంలో టీడీపీని తల్లకిందులు చేస్తున్నాయి
వాస్తవంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అధికభాగం.. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయమై స్పష్టమైన సమాచారంతో ఉన్న సీఎం వైఎస్ జగన్.. గత ఏడాది సెప్టెంబర్‌లో.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక షెడ్యూల్‌ను రూపొందించారు. దానిని మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మంత్రి వారంలో రెండు రోజులు, ఎమ్మెల్యే మూడు రోజులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి. ఇలా ప్రతి వారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ కార్యక్రమాన్ని కొంత మంది ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పటి మాదిరిగానే ఎవరి వ్యాపార వ్యవహారాల్లో వారు నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతి కదలికను తెలుసుకుంటున్న సీఎం జగన్.. గత నెలలో మరోసారి ప్రజల్లోకి వెళ్లే విషయం గురించి ప్రస్తావించారు. కొత్త ఏడాది ప్రారంభంలో పీకే టీం వస్తుందని, సర్వేలు మొదలవుతాయని.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల మాత్రమే వారి అభిమానం గెలుచుకోగలమని స్పష్టం చేశారు. అయినా మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించిన దాఖలాలు లేవు.
అయితే కొంత మంది ఎమ్మెల్యేలు.. ప్రారంభం నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను ఆలకిస్తున్నారు. పరిష్కరిస్తున్నారు. శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నారు. 9 ఏళ్ల పాటు పార్టీని భుజాన మోసిన కార్యకర్తలు, స్థానిక నేతల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ తరహాలో పని చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య బాగా తక్కువ. మిగతా ఎమ్మెల్యేల గురించి ఆయా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సర్వే పేరుతో ఫోన్ చేసిన వారికి, తమ వద్దకు వచ్చిన వారికి ఏమి చెప్పి ఉంటారో ఊహించగలం. ఈ సర్వే పూర్తయిన తర్వాత.. ఆ ఫలితాలను ఎమ్మెల్యేల ముందు పెట్టే అవకాశం లేకపోలేదు. ఇదీ మీ పరిస్థితి.. అంటూ వైసిపి అధినేత క్లాస్ పీకడం.. వచ్చే ఎన్నికల గురించి హెచ్చరించడం సర్వ సాధారణంగా జరుగుతుంది. ఇకపై ఇలాంటి సర్వేలు 2024 ఎన్నికల వరకు తరచూ జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : జగన్ రెడ్డి ఏనాడైనా సొంతంగా సహాయం చేశాడా? రాధాకృష్ణ ప్రశ్న..