iDreamPost
android-app
ios-app

వైసీపీ కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌.. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక జాబ్‌మేళాలు

వైసీపీ కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌.. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక జాబ్‌మేళాలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఉద్యోగమేళాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేత, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎవరు విమర్శలు చేసినా ఫర్వాలేదని, వైసీపీ కార్యకర్తలకు 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు వారి అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

మూడు ప్రాంతాల్లో మూడు జాబ్‌మేళాలు..

రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కార్యకర్తలకు హాజరయ్యేందుకు అనువుగా మూడు జాబ్‌మేళాలు ఏర్పాటుకు సంకల్పించారు. మొదటి జాబ్‌మేళా ఈ నెల 16,17వ తేదీలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ మేళాకు హాజరుకావచ్చు. ఈ నెల 23, 24 తేదీల్లో రెండో జాబ్‌ మేళా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించతలపెట్టారు. ఈ మేళాకు ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకావచ్చు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఈ నెల 30, మే 1వ తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు.

దరఖాస్తుకు వెబ్‌సైట్‌.. వెంటనే నియామకపత్రాలు..

జాబ్‌మేళాలకు హాజరయ్యే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.www.ysrcpjobmela.com వెబ్‌సైట్‌ను శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా నేతలు ఆవిష్కరించారు. జాబ్‌మేళాలకు హాజరయ్యే వారు తమ ఒరిజనల్‌ సర్టిఫికెట్స్‌తో వెళ్లాలి. ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి, ఎంపికైన వారికి వెంటనే నియామక పత్రాలు అందిస్తారు.