Idream media
Idream media
రాజకీయాల్లో చారిత్రక విజయాలకు పర్యాయపదంగా వైసీపీ పేరు మార్మోగుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రభ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. నాటి అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి స్థానిక ఎన్నికల వరకు రికార్డులకు పెట్టింది పేరుగా జగన్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. అభివృద్ధి పనులేవీ చేపట్టడం లేదు.. సంక్షేమ పథకాలకు ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తున్నారు అనే ప్రతిపక్షాల ఆరోపణలు.. కేవలం ఆరోపణలు మాత్రమే అని, వాస్తవం కాదని ప్రజలు నమ్ముతున్నట్లు స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
రాష్ట్రంలోని 12 కు 12 కార్పొరేషన్ లను కూడా ఒకే పార్టీ (వైసీపీ) గెలవడం ఇదే మొదటిసారి. 75 మునిసిపాలిటీలలో కూడా 74 సాధించింది. ఆ ఒక్కటి అయిన తాడిపత్రి లో కేవలం 2 వార్డులు తక్కువ తో వైసీపీ ఓడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రబల శక్తిగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లను మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపాదించింది వైసీపీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు రాగా, కొద్ది నెలలు క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి 52.63 శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండేళ్లలో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. వైసీపీని అందుకోవడం విపక్షపార్టీల వల్ల కావడం లేదు.
తాజాగా వెల్లడైన ఏలూరు కార్పొరేషన్ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కార్పొరేషన్ లను సాధించిన ఏకైక పార్టీగా వైసీపీ నిలిచింది. మున్సిపల్, కార్పొరేషన్ లను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, , సంక్షేమం తప్ప అభివృద్ది లేదంటూ పలు అంశాలను వివాదంగా మలిచేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, పురజనులంతా జగన్ కు జైకొట్టారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించనప్పటికీ, అవి పార్టీ రహిత ఎన్నికలు కావడంతో విపక్షాలు అసత్య కథనాలను ప్రచారం చేశాయి. పార్టీల గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వైసీపీ సత్తా నిరూపితమైంది.
రెండేళ్ల కిందటి అసెంబ్లీ ఎన్నికల కు మించి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాను గాలి జోరుగా వీచింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకోగా, రెండేళ్ల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒకటి రెండు చోట్ల మాత్రమే గట్టిపోటీ ఇవ్వగలిగింది. బీజేపీ, జనసేన దాదాపు పత్తాలేకుండా పోయాయి. ప్రజలను నమ్ముకున్న నేతను ఎప్పుడైనా ఆదరిస్తారనేందుకు జగన్ ఓ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. వివాదాలతో వాయిదా పడ్డ ఏలూరు కార్పొరేషన్ లో కూడా వైసీపీ జెండాయే ఎగరడంతో మరోసారి జగన్ పేరు మార్మోగుతోంది. ఇక ఆయనకు ఏపీలో తిరుగులేదనే చర్చ జరుగుతోంది.