iDreamPost
android-app
ios-app

YCP, Nellore Corporation – సింహపురిలో జూలువిదిల్చిన వైసీపీ.. పత్తాలేకుండా పోయిన టీడీపీ

YCP, Nellore Corporation – సింహపురిలో జూలువిదిల్చిన వైసీపీ.. పత్తాలేకుండా పోయిన టీడీపీ

నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ ఘన విజయం సాధించింది. అన్ని స్థానాల్లోను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. నెల్లూరు జిల్లాలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించింది. ప్రతిపక్ష టీడీపీ సహా ఏ రాజకీయ పార్టీకి అకాశం ఇవ్వలేదు. ఒక్క డివిజన్‌లోనూ ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించలేకపోవడం.. నెల్లూరులో వైసీపీకి ఉన్న పట్టుకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సహా రాష్ట్ర నేతలు, స్థానిక నేతలు నెల్లూరులో తిష్టవేసినా.. టీడీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది.

నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉండగా 8 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 46 డివిజన్లను కూడా వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుని కార్పొరేషన్‌ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ కార్పొరేషన్‌ను వైసీపీ గెలుచుకుంది. అప్పుడు 54 డివిజన్లకు గాను వైసీపీ 31 చోట్ల విజయం సాధించగా.. ఈ సారి మొత్తం డివిజన్లను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. 2014లో టీడీపీ, బీజేపీలు కూటమిగా పోటీ చేసి 15 డివిజన్లు గెలుచుకోగా.. ఈ సారి టీడీపీ.. సీపీఎంతో, బీజేపీ.. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా.. ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయాయి. పోయిన సారి స్వతంత్రులు ఆరు డివిజన్లలో గెలవగా.. ఈ సారి స్వతంత్రులకు నెల్లూరు ఓటర్లు అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా వైసీపీ వైపు మొగ్గుచూపారు.

1884లో మున్సిపాలిటీగా ఏర్పడిన నెల్లూరు.. దాదాపు 120 ఏళ్ల తర్వాత 2004లో కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి సారి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌లో పాగా వేయగా.. ఆ తర్వాత 2014 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా.. వైసీపీ తన సత్తాను చాటింది. ఈ సారి మునుపటి కన్నా ఘనవిజయం సాధించి.. కార్పొరేషన్‌లో ఇతర పార్టీలకు అవకాశం లేకుండా చేసింది.

టీడీపీ సీపీఎంతో అధికారికంగా పొత్తు, బీజేపీ, జనసేన పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నా.. టీడీపీకి భంగపాటు తప్పలేదు. కనీసం ఒక్క డివిజన్‌ను కూడా గెలుచుకోలేకపోవడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ పార్టీ నేతలు కోటం రెడ్డి శ్రీనివాసులు, మాజీ మేయర్‌ అజీజ్‌లు.. పోలింగ్‌ రోజు వైసీపీ వాళ్లు తమ పార్టీ నేతలపై దాడులు చేశారంటూ హడావుడి చేసి సింపతి కోసం యత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు వైసీపీకి అఖండమైన విజయాన్ని అందించారు.

Also Read : Peddireddy, Kuppam Municipality – చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు.. పుంగనూరులో పోటీ చేయాలని ఆహ్వానం