Idream media
Idream media
ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను వేదికగా చేసుకుని తమ గళం వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. కరోనా కాటుతో ఆర్థికాభివృద్ధి కుంటుపడడం, కేంద్రం నుంచి అందాల్సినవి అందకపోవడం తదితర అంశాలను ఈ సందర్భంగా లేవనెత్తేందుకు సమాయత్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ కూడా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ ఈ మేరకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జల వివాదం పరిష్కారానికి ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసిన జగన్.. పార్లమెంట్ లో దీనిపై స్పష్టత ఇచ్చేలా తన ఎంపీల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇంకా పలు అంశాలపై చర్చించేందుకు నేడు వైసీపీ ఎంపీలతో భేటీ కానున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చించేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నాయకుడు మిథున్ రెడ్డితోపాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జగన్ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు తెలిసింది. వాటిపై గురువారం జరగబోయే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రధానంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అంశాలతోపాటు ఇటీవల చర్చనీయాంశమైన రుణ పరిమితి తగ్గింపు, కృష్ణా జలాలపై తెలంగాణతో వివాదాలు వంటి విషయాలపైనా పార్లమెంట్ లో ఏం మాట్లాడాలనేదానిపై ఎంపీలకు సీఎం సూచనలు చేయనున్నారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పైనా చర్చించుకుని, దాన్ని సభ ముందుకు తెచ్చేలా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్లమెంట్ సమావేశాల కంటే ముందుగానే కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న ఏపీ సీఎం జగన్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా సీఎంలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారు.
సొంత పార్టీపై, సీఎం జగన్ పై సంచలన విమర్శలు, అనూహ్య ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని, ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా అవసరమైతే సభను స్తంభింపజేస్తామని కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే, ఈ వర్షాకాల సమావేశాల్లోనే రఘురామపై వేటు పడేలా స్పీకర్ నిర్ణయం ఉండొచ్చనీ వైసీపీ ఎంపీలు తాజాగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి, రఘురామ అంశాన్ని సభ లేవనెత్తేందుకు జగన్ అనుమతిస్తారా, లేదా అనేది నేటి సమావేశంలో స్పష్టత రానుంది.
ప్లాంట్ పరిరక్షణకు ఒత్తిడి తెస్తాం : విజయసాయి
ఈ పార్లమెంటు సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంటు అంశాన్ని లేవనెత్తుతామని… ప్లాంటును ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. వచ్చే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టబోయే నిరసనలకు తాము మద్దతిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంపీ విజయసాయి, మంత్రి అవంతి శ్రీనివాస్ లతో సమావేశమయ్యారు. విపక్ష నేతల మద్దతును కూడా కూడగట్టి పార్లమెంటులో తమ గళాన్ని వినిపిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని… అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం సరికాదని చెప్పారు.