Idream media
Idream media
ఏపీకి ప్రత్యేక హోదాను తాజాగా పదే పదే తెరపైకి తెస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వచ్చి హోదా కోసం వైసీపీ ప్రభుత్వం పోరాడడం లేదని, కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని అడగడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ప్రత్యేక హోదా గొంతు వినబడకుండా చేసిందెవరు? రాజకీయ లబ్ది కోసం కేంద్రానికి తాకట్టు పెట్టిందెవరు అనే విషయాలను మరచిపోతున్నారు.
తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అధికారంలో ఉండగా టీడీపీ చేతగాని తనాన్ని తానే బయటపెట్టుకున్నారు. ‘గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేకహోదాను తన కేసులమాఫీ కోసమే కేంద్రానికి తాకట్టుపెడుతున్నారు’ .. అని స్టేటు మెంట్ ఇచ్చిన ఆయన తాము హోదా కోసం పోరాడలేదని చెప్పకనే చెప్పారు.
చంద్రబాబు తర్వాత తనకు తానే మేధావిగా భావించే వ్యక్తుల్లో రామకృష్ణుడు ముఖ్యులు. కానీ, అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఆయన మాటల్లో వాడివేడి తగ్గుతూ వస్తోంది. అంతేకాదు.. ఒక్కోసారి పార్టీకే రివర్స్ కొట్టేలా మారుతోంది. తాజాగా కూడా అదే జరిగింది. రాష్ట్రం విడివడి కొత్తగా సౌకర్యాలు సమకూర్చుంటున్న సమయంలోనే ప్రత్యేక హోదాను గట్టిగా అడగాల్సి ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టడంపై అప్పటికి ఇంకా ప్రజల్లో వేడి కూడా చల్లారలేదు. అటువంటి సమయంలో హోదా కోసం గొంతెత్తాల్సిన నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్యాకేజీ వైపు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా లక్ష్యం నీరుగారిపోయింది. కేంద్రం హోదా కోసం ఆలోచించేలా చేయడంలో చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారు. ఎందుకంటే 2014-18 మధ్య ఎన్డీయేలో చంద్రబాబు కూడా భాగస్వామి కాబట్టే.
భాగస్వామిగా ఉన్నన్ని సంవత్సరాలు కేంద్రం ఎలా చెబితే అలా నడచుకున్న చంద్రబాబు ఒకసారి ప్రత్యేకహోదా అని మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంటు యూటర్నులు తీసుకున్న విషయం అందరు చూసిందే. చివరికి బీజేపీ బలహీనపడిందన్న తప్పుడు అంచనాలతో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసేంతవరకు హోదాపై చంద్రబాబు చేసిన పోరాటాలేమీ లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మాత్రమే చంద్రబాబు ప్రత్యేకహోదా అంటే స్ధిరమైన డిమాండ్ వినిపిస్తున్నారు. ఎందుకంటే తాను సాధించలేక ఫెయిలైన డిమాండ్ లో జగన్ కూడా ఫెయిల్ అవుతారన్న అంచనాతో మాత్రమే ప్రత్యేకహోదా డిమాండ్ ను తలకెత్తుకున్నారు. గట్టిగా పోరాడితే ప్రత్యేకహోదా సాధ్యమే అయితే మరి టీడీపీ ఎందుకని పోరాడలేకపోయింది ? అంటే టీడీపీ కూడా ఫెయిలైందని యనమల అంగీకరించినట్లే కదా.?