iDreamPost
android-app
ios-app

యనమల అప్పుల నీతి చంద్రిక

యనమల అప్పుల నీతి చంద్రిక

ఏపీ సీఎం జ‌గ‌న్ కు ప్రభుత్వాన్ని న‌డ‌ప‌డం ఓ ఎత్తు అయితే.. చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే
మీడియా చేసే అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డం ఓ స‌వాలుగా మారింది. అయితే ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చుని ఇర‌వై అయిదు నెల‌లే అయిన‌ప్ప‌టికీ, జ‌గ‌న్ చాలా స‌మ‌ర్ధ‌వంతంగా ఆ ప‌నిని నిర్వ‌హిస్తున్నారు. ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయకుండా ఉండ‌దు. ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల‌ను ప్ర‌శ్నించాలి కూడా. అయితే, విమర్శలు అర్ధవంతంగా ఉండాలి. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడ‌దామ‌న్న ఉద్దేశంతో అస‌త్యాలను ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించ‌కూడ‌దు. గ‌తంలో క‌రోనా విప‌త్తు విష‌యానికి సంబంధించి అది కేవ‌లం ఏపీలోనే ఉన్న‌ట్లుగా టీడీపీ నేత‌లు హ‌డావిడి చేశారు. జ‌గ‌న్ వాటిని త‌ప్పికొట్ట‌డంలో స‌ఫ‌లీకృతం అయ్యారు. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో దేశంలోనే పేరుగాంచారు.

ఇప్పుడు ఏపీ సర్కారు చేస్తున్న అప్పుల విషయంలో అనేక విమర్శలు వాదనలు తెరమీదికి వస్తున్నాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రం అప్పుల కుప్పగామారిపోతోందని.. జగన్ రాష్ట్రాన్ని అప్పుల మయం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక మీడియా అయితే.. రోజుకో కథనం వండివడ్డిస్తోంది. దీంతో సర్కారుకు.. అప్పుల ముప్పుకన్నా.. ఈ విమర్శల సెగ ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వీటికి అడ్డుక‌ట్ట వేసేందుకు జ‌గ‌న్ వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఆ బాధ్య‌త‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి అప్ప‌గించారు.

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా.. ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల కోసం అవ‌స‌ర‌ర‌మైతే కొన్ని అప్పులు చేయాల్సి రావ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాన్ని పాలించిన అంద‌రూ ఆప‌ద్కాలంలో అప్పులు చేసిన వాళ్లే. కానీ, జ‌గ‌న్ ఒక్క‌రు మాత్ర‌మే అప్పులు తెస్తున్న‌ట్లు, పైగా వాటిని దుబారా చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియా ద్వారా విప‌రీతంగా ప్ర‌చారం చేయిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా అప్పు చేయ‌క త‌ప్ప‌దు. ఆ మాట‌కొస్తే కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్పుల్లోనే ఉంద‌న్న విష‌యం చంద్ర‌బాబుకు తెలియ‌న‌ది కాదు. ఈ విష‌యాల‌నే వెలుగులోకి తెస్తూ దుష్ప్ర‌చారానికి చెక్ పెట్టిస్తున్నారు జ‌గ‌న్.

కరోనా సమయంలో దెబ్బతిన్న అన్ని రంగాలను గాడిలో పెట్టేందుకు విస్తృతంగా నిధులను ప్రజలకు సంక్షేమం రూపంలో ప్ర‌భుత్వం అందించింది. ఆ విష‌యాన్ని మంత్రి బుగ్గన ఇప్ప‌టికే వివ‌రించారు. అంతేకాకుండా ఏయే రాష్ట్రాలు ఎన్నెన్ని అప్పులు చేశాయో, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌న‌ప్ప‌టికీ గతంలో చంద్రబాబు హయాంలో ఎన్ని అప్పులు చేశారో కూడా వివ‌రించారు. ఇక తాజాగా.. ప్రభుత్వ రాజకీయ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయంపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమేనని, కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని చెప్పారు. “కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం రూ.30 వేల కోట్లు తగ్గింది. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకోవడం కోసం రూ.30 వేల కోట్లను సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేశారు. మొత్తమ్మీద ప్రభుత్వంపై రూ.60 వేల కోట్ల భారం పడినా ప్రజలపై ఎలాంటి భారం వేసేలా ధరలు పెంచలేదు“ అని సజ్జల పేర్కొన్నారు.

అంతేకాదు.. విభజన సమయంలో రాష్ట్ర వాటాగా వచ్చిన రూ.90 వేల కోట్ల రుణాన్ని.. ఎడాపెడా అప్పులతో దోపిడీ చేసి దాన్ని రూ.3.60 లక్షల కోట్లకు పెంచేసి చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ సర్కారు తీరును వివ‌రించారు. ఇలా అటు బుగ్గ‌న‌, ఇటు స‌జ్జ‌ల ద్వారా వాస్త‌వాల‌ను వెల్ల‌డి చేస్తూ.. దుష్ప్ర‌చారాల‌కు చెక్ పెడుతున్నారు. నిండ‌కుండ‌లా ఎక్క‌డా తొణికిస‌లాడ‌కుండా స‌మ‌ర్ధ‌వంతంగా జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్న తీరును అభినందించాల్సిందేన‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.