iDreamPost
android-app
ios-app

య‌డ్డి క‌థపై క్లారిటీ.. మ‌రి కొత్త సీఎం ఎవరు?

య‌డ్డి క‌థపై క్లారిటీ.. మ‌రి కొత్త సీఎం ఎవరు?

మరో మూడు రోజుల్లో అంటే జూలై 26 నాటికి ముఖ్య‌మంత్రిగా య‌డియూర‌ప్ప రెండేళ్లు పూర్తి చేసుకుంటారు. సరిగ్గా అదే రోజు సీఎంగా ఆయ‌న క‌థ ముగుస్తుందా? అంటే.. అవున‌నే సంకేతాలు య‌డియూర‌ప్ప మాట‌ల్లోనే క‌నిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వ‌చ్చిన య‌డియూర‌ప్ప త‌న‌ను రాజీనామా చేయ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని, రాజీనామా వార్త‌లు అన్నీ ఊహాగానాలే అని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఆయ‌నే ‘‘ఈ నెల 26న రెండేళ్ల పాలనపై సాధన సమావేశం నిర్వహిస్తాం. ఆపై అధిష్ఠానం పెద్దలు సూచించినట్లుగా నడుచుకుంటాను. భవిష్యత్తులోనూ బీజేపీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేస్తాను. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులలో కొనసాగించే సంప్రదాయం బీజేపీలో లేదు.’’ అని చెప్ప‌డం నిష్క్ర‌మ‌ణ‌ను ఒప్పుకున్న‌ట్లు తేలిపోయింది. య‌డియూర‌ప్ప రాజీనామా చేస్తార‌ని తేలిపోయింది. కొత్త సీఎం ఎవ‌ర‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

ముఖ్యమంత్రి మార్పు అంశం కర్ణాటకలో కొద్ది రోజులుగా, ఆ మాట‌కొస్తే నెల‌లుగా హాట్‌ టాపిక్‌గా న‌డుస్తూనే ఉంది. బీజేపీలోని ఓ వ‌ర్గం ఆయ‌న‌పై ఎప్ప‌టి నుంచో అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతూనే ఉంది. ప‌లు మార్లు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేసింది కూడా. స్వయంగా నాయకులు మోదీ, అమిత్‌ షాతో సమావేశమై యడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా యడ్డికి వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో అనారోగ్యం బాగోలేక య‌డియూర‌ప్పే రాజీనామా చేస్తున్నార‌ని, ప‌లు మార్లు, అధిష్ఠానం ఆదేశాల‌తో ప‌ద‌వి వీడుతున్నార‌ని కొన్నిసార్లే.. అబ్బే అలాంట‌దేమీ అంతా ట్రాష్ అని ఇంకో సారి.. ఇలా ర‌క‌ర‌కాలుగా య‌డియూర‌ప్ప రాజీనామా ఎపిసోడ్ కొన‌సాగింది. చివ‌ర‌కు 78 ఏళ్ల రాజ‌కీయ కురువృద్ధుడి రాజీనామా చేయ‌డం త‌థ్యంగా క‌నిపిస్తోంది.

య‌డియూర‌ప్ప రాజీనామా చేయ‌నుండ‌డంతో ఆయ‌న త‌ర్వాత కుర్చీ ఎక్కేందుకు చాలా మంది త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. సీఎం రేసులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సీటీ రవితో పాటు రాష్ట్ర మంత్రులు మురుగేశ్‌ నిరాణి, ఉపముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్థనారాయణల పేర్లు బెంగళూరు, ఢిల్లీలో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్నాయి. లింగాయత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే మురుగేశ్‌ నిరాణికి చాన్స్‌ ఇస్తారని చెబుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు ప్రహ్లాద్‌ జోషి లేక సీటీ రవిలో ఒకరిని సీఎం చేయాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గడిచిన నాలుగైదు రోజులుగా పలువురు కర్ణాటక నేతలు హస్తినలోనే మకాం వేసి తమ గాడ్‌ఫాదర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అగ్రనేతలు పిలిచారని మరో మంత్రి శ్రీరాములు బుధవారం హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. సీటీ రవి జాతీయనేత హోదాలో అక్కడే ఉన్నారు. మురుగేశ్‌ నిరాణి మూడు రోజులకోసారి ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అశ్వత్థనారాయణ అగ్రనేతలకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. యడియూరప్ప రాజీనామా ఖరారు కావడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలలో భారీగా మార్పులు క‌లిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.