iDreamPost
android-app
ios-app

World’s highest railway line – ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన.. నోనీ ఆకాశమంత ఎత్తున

  • Published Nov 30, 2021 | 5:48 AM Updated Updated Nov 30, 2021 | 5:48 AM
World’s highest railway line – ప్రపంచంలోనే అతి ఎత్తైన రైలు వంతెన.. నోనీ ఆకాశమంత ఎత్తున

ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం నోనీ వ్యాలీలో 141 మీటర్ల ఎత్తున రైల్వే వంతెన నిర్మాణం చేస్తుంది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు దేశంలో ఉన్న బ్రాడ్‌ గేజ్‌ నెట్‌వర్కుతో అనుసంధానం చేసేందుకు జిరిబామ్‌ నుంచి తుపుల్‌ మీదుగా ఇంఫాల్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు ఐరోపాలోని మౌంటెనెగ్రోలో ఉన్న మాలా` రెజెకా వయాడక్ట్‌ రైలు వంతెన ప్రపంచంలో అతి ఎత్తు పిల్లర్ల వంతెనగా పేరొందింది. ఈ రికార్డును నోనీ వ్యాలీ మీద నిర్మించనున్న పిల్లర్ల వంతెన బద్దలు కొట్టనుంది. ఈ వంతెన కుతుబ్‌ మినార్‌ కంటే దాదాపు రెండురెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుందని రైల్వేశాఖ చెబుతోంది.

సుమారు 111 కిమీల నడివిడి ఉన్న రైల్వేలైన్‌ ఇది. జిరిబామ్‌ నుంచి ఇంఫాల్‌కు రోడ్డు మార్గం ద్వారా 11 నుంచి 12 గంటలు పడుతున్న ప్రయాణ సమయం కేవలం 2.50 గంటలకు తగ్గనుంది. కేవలం ఈ వంతెన నిర్మాణానికి రూ.374 కోట్లు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేయగా, మొత్తం రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.12 వేల 264 కోట్లు అవుతుందని అంచనా. దీనిని బ్రిడ్జి నెంబరు 164గా పిలవనున్నారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నారు. ఈ రైల్వేలైన్‌ 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. 2023 నాటికి పూర్తవుతుందని తాజా అంచనా. దీనిని భవిష్యత్‌లో మన సరిహద్దున ఉన్న మియన్మార్‌ దేశానికి విస్తరించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

Also Read : Konaseema Railway Line – కోనసీమలో రైల్వే కూతకు ఇంకా ఎంతకాలం? 

ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణాలో ఇంఫాల్‌ రైల్వే ప్రాజెక్టు కీలకం కానుంది. సుమారు 25 టన్నుల వరకు యాక్సిల్‌ లోడు తట్టుకునేలా వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ రైల్వే లైన్‌ హిమాలయ పర్వతాలలో కొండల మధ్య నుంచి సొరంగాలు, లోయలపై వంతెనల మీదుగా సాగుతుంది. నోనీ వంతెన భూకంపాల ప్రభావిత ప్రాంతంలో ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా భూకంపాలను తట్టుకునేలా దీనిని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా భారీ వర్షాలు పడినా, కొండచరియలు విరుచుకుపడినా ఇబ్బంది రాకుండా దీని నిర్మాణం చేస్తున్నారు. 241 కిమీల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా నిర్మాణం చేస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తునట్టు రైల్వే ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు తెలిపారు. మొత్తం 149 వంతెనలు నిర్మాణం చేస్తున్నారు. దీనిలో ఈ వంతెన కీలకం కానుంది. ఇంచుమించు కిలోమీటరకు ఒకటి చొప్పున వంతెన నిర్మాణం జరుగుతోంది. అలాగే 52 సొరంగ మార్గాలున్నాయి.

ఏడు ఈశాన్య రాష్ట్రాలలో రైల్వేలైన్‌ నిర్మాణం భారతీయ రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులకు ఎప్పుడూ కత్తిమీద సామే. మరీ ముఖ్యంగా హిమాలయ పర్వతశ్రేణుల్లో నిర్మాణం సవాలుతో కూడుకున్న అంశం. వర్షాకాలంలో ఇక్కడ తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. పైగా ఇక్కడ ఏప్రిల్‌ నెల నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఇక్కడ పనిచేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాగే తీవ్రవాద సమస్య కూడా ఉంది. వీటన్నింటినీ అధిగమించి రైల్వేలైన్‌ నిర్మాణం చేయాల్సి ఉంది.

దీని నిర్మాణం వల్ల ప్రయాణీకుల ప్రయోజనాలు, రవాణా వ్యవస్థ మెరుగు పడడమే కాదు.. భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఇది కీలకం కానుంది. ఈశాన్య రాష్ట్రాలో కేవలం మూడు రాష్ట్రాల రాజధానులకు మాత్రమే ఇప్పటి వరకు రైల్వే నెట్‌వర్కు ఉంది. అస్సాం (గౌహతి), అరుణాచల్‌ ప్రదేశ్‌ (ఇటానగర్‌), త్రిపురా (అగర్తల్‌) రాజధానులకు రైల్వే లైన్‌ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే నాల్గవ రాజధానికి రైల్వే నెట్‌వర్కు ఏర్పడనుంది. మణిపూర్‌ మయన్మార్‌ను ఆనుకుని ఉంది. ఇక్కడ నుంచి తీవ్రవాదులు అధిక సంఖ్యలో మనదేశంలోకి వస్తున్నారు. అలాగే చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్నందున భద్రతా కారణాల రీత్యా ఈ రైల్వేలైన్‌ కీలకం కానుంది.

Also Read : Kakinada,Kotipalli – రైల్‌ బస్సు ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో..?