iDreamPost
android-app
ios-app

పిల్లి క‌థ‌

పిల్లి క‌థ‌

కుక్క‌ల‌కి ఒక రోజు వ‌స్తుంద‌ని తెలుసు కానీ, పిల్లుల‌కీ ఒక రోజు వుంద‌ని ఈ పొద్దే తెలిసింది. ఆగ‌స్టు 8 అంత‌ర్జాతీయ పిల్లుల రోజు. కుక్క‌లాగే పిల్లి కూడా మ‌న ఇంటి మ‌నిషి. ప‌ల్లెల్లో ఒక‌ప్పుడు ప్ర‌తి ఇంట్లో పిల్లి వుండేది. ఎలుక‌ల్ని ప‌ట్టేదో లేదో తెలియ‌దు కానీ, పాలు పెరుగు గ్యారెంటీగా తాగేది. నా చిన్న‌త‌నంలో పల్లెల్లో పాలు దొరికే కాలం వుండేది. వూళ్ల‌లోకి పాల కేంద్రాలు, పాల ప్యాకెట్లు రాని కాలం. ఎనుములు కూడా జీవితంలో ఒక భాగం.

తెల్లారుజామున మా జేజి పాలు పిండే సుయ్యిసుయ్యి శ‌బ్దంతో పాటు చిన్న పిల్ల‌లా ఆమె చుట్టూ తిరిగే పిల్లి గోము మియ్యావ్ శ‌బ్దాలు వినిపించేవి. పిల్లి కోసం చిన్న గిన్నె వుండేది. కాసిన్ని పాలు పోస్తే తాగేసి , ఎక్క‌డో నిద్ర‌పోయి , మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం పెరుగ‌న్న‌మో, మ‌జ్జిగ‌న్న‌మో తింటున్న‌ప్పుడు కంచం దగ్గ‌ర ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేది. కాసింత తిని మ‌ళ్లీ మాయం. కుక్క‌లా పిలిస్తే వ‌చ్చే టైప్ కాదు. సొంత అభిప్రాయాలెక్కువ‌. కుక్క మ‌న‌కి సేవ చేస్తే పిల్లికి మ‌నం చేయాలి. కుక్క మ‌న‌ల్ని దేవుడ‌నుకుంటే, పిల్లి త‌న‌ని తాను దేవుడ‌నుకుంటుంది.

చిన్న‌ప్పుడు పిల్లితో మాట్లాడేవాన్ని, దాని భాష అర్థ‌మ‌య్యేది. పెద్దాడై తెలివి మీరే స‌రికి మ‌నుషులు , జంతువులు ఇద్ద‌రూ అర్థం కాకుండా పోయారు. తోక తొక్కితే పిల్లికి భ‌లే కోపం. పిల్లే కాదు అన్ని జంతువులు కూడా తోకే జ్ఞాన‌మ‌ని న‌మ్ముతాయి. మ‌న‌కి కూడా తోక‌లు పెరుగుతాయి కానీ, అవి మ‌న‌కి కాకుండా ఎదుటి వాళ్ల‌కి క‌న‌ప‌డ‌తాయి.

ఒక‌ప్పుడు పిల్ల‌ల పెంప‌కంలో మ‌ర్క‌ట కిశోర న్యాయం వుండేది. అంటే కోతి పిల్ల త‌ల్లిని గ‌ట్టిగా కరుచుకుని వుండ‌డం. ప‌డి పోతే దానిదే బాధ్య‌త‌, త‌ల్లిది కాదు. బ‌తికి బాగుండాల‌నే భ‌యం పిల్ల‌ల్లోనే వుండేది. ఇప్పుడు మార్జాల కిశోర న్యాయం. పిల్లి త‌న పిల్ల‌ని నోటితో క‌రుచుకుని వెళుతుంది. పిల్ల అభిప్రాయాలు ప‌నికి రావు.

Also Read : పవన్ కళ్యాన్‌ పై మళ్లీ పరకాల విమర్శలు, సోషల్ మీడియాలో ప్రకంపనలు

అమ్మానాన్న‌లు పుట్ట‌క ముందే పిల్ల‌ల్ని ఏ స్కూల్లో చ‌దివించాలి, LKGలోనే IIT ఫౌండేష‌న్ వేయించాల‌నే నిర్ణ‌యించేస్తున్నారు. తోమితోమి రుద్దిరుద్ది అయ్య‌వార్ని చేయ‌బోయి కోతిని చేస్తున్నారు.

పిల్లి సామెత‌లు చాలా. క‌ళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి ఎవ‌రూ చూడ్డం లేద‌నుకుంటుంది. ఇది మ‌న నాయ‌కుల‌కు వ‌ర్తిస్తుంది. పిల్లి మెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు? ఎలుక‌లు ఎప్ప‌టికీ క‌ట్ట‌లేవు. పిల్లిలా మారువేషం వేస్తే త‌ప్ప‌. అప్పుడు ఎలుక కూడా త‌న‌ను తాను పిల్లిగానే భావిస్తుంది. వేష‌మంటేనే మోసం. పిల్లికి చెల‌గాటం, ఇది కూడా మ‌న రాజ‌కీయాల్లో వ‌ర్కౌట్ అవుతుంది. బ‌య‌ట పులి, ఇంట్లో పిల్లి. పులి , పిల్లి సైజులో తేడా కానీ, జాతి ఒక్క‌టే. ఇంట్లో పెద్ద పులి వుంటే మామూలు పులి, పిల్లిలా మారాల్సిందే.

అబద్ధం ఇంట్లో వున్న‌ పిల్లి లాంటిద‌ట‌, ఒక‌సారి కిటికీ దూకిందా దాన్ని ప‌ట్టుకోవ‌డం క‌ష్టం. పిల్లుల‌కి రాయ‌డం వ‌స్తే, మ‌నుషులు త‌మ బానిస‌లుగా ఎలా జీవించారో రాస్తాయి. మ‌నిషి పెంపుడు జంతువు. పిల్లుల Text bookలో మొద‌టి వాక్యం.

ఫ్రెంచ్ వాళ్లు కుక్క‌ని వ‌చ‌నంతో , పిల్లిని క‌విత్వంతో పోల్చుతారు. కుక్క‌లు ఎక్కువ మొరుగుతాయి. పిల్లి తాను చెప్పాల్సింది ఒక్క మియావ్‌తోనే చెబుతుంది.

పిల్లుల్ని ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు పూర్వ జ‌న్మ‌లో ఎలుక‌లై వుంటారు. విషాదం ఏమంటే న‌గ‌రాల్లో పిల్లులు, ఎలుక‌లు రెండూ క‌నుమ‌రుగై పోతున్నాయి. ఒక‌టి పాడికి, ఇంకొక‌టి పంట‌ల‌కి సంకేతం. ఈ భూమి అంద‌రిదీ, అన్నింటిని త‌రిమేసి మ‌నం మాత్ర‌మే వుండాల‌నుకుంటాం. అందుకే క‌రోనా వ‌చ్చేది. పిల్లికి క‌రోనా అంటే తెలియ‌దు. ఎందుకంటే అది భూమిపై బ‌త‌కాల‌నుకుంటుంది. హ‌క్కుని , ప‌త్రాల్ని కోరుకోదు.

Also Read : మనం మనం బరంపురం అని ఎందుకంటాం!