Krishna Kowshik
Krishna Kowshik
దేవాలయాల్లో అర్చకులు, పూజారులు ఎక్కువగా మగవారే ఉంటారు. ఆడవారికి ఉండే నెలసరి సమస్యలు ఇతర కారణాలతో అర్చకత్వం వైపు మొగ్గు చూపలేదు. భగవంతుడికి సేవ చేసుకువాలని ఉన్నా మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మహిళలు వెనకడుగు వేశారు. అయితే ఈ రంగంలో ఆడవారికి కూడా అవకాశం కల్పిస్తోంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి నాంది పలికింది కూడా డీఎంకే ప్రభుత్వమే. 2007లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిథి తొలిసారిగా ఓ మహిళను అర్చకురాలిగా నియమించగా.. ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలో మరో మహిళకు అవకాశం కల్పించారు. తాజాగా మరో ముగ్గురు మహిళలు అర్చకత్వాన్ని చేపట్టనున్నారు. మహిళలు అర్చకత్వంలోకి అడుగుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శిక్షణనిస్తోడటం విశేషం. తాజాగా అర్చకత్వం శిక్షణ పూర్తి చేసిన మహిళలు 20 నుండి 30 మధ్య వయస్కులు కావడం గమనార్హం. శిక్షణ తీసుకుని గుడిలోకి అర్చకులుగా అడుగుపెట్టబోతున్న తొలి మహిళలు వీరు.
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన అర్చకులు కావొచ్చునన్న పథకాన్ని స్టాలిన్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అలాగే స్వయంగా అందుకు తగ్గ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఆశావాహులైన మహిళలను ఆహ్వానించింది. తాజాగా ముగ్గురు నారీమణులు అర్చకత్వ శిక్షణ పూర్తి చేశారు. ఎన్ రంజిత, ఎస్ రమ్య, సి కృష్ణవేణిలు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రంలో అర్చక కోర్సును పూర్తి చేసి.. పూజారులుగా ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారు. వీరికి మానవ వనరుల శాఖ మంత్రి సర్టిఫికేట్ అందించారు. వీరంతా త్వరలో వివిధ ఆలయాల్లో ఏడాది పాటు శిక్షణ పొందనున్నారు. ఇప్పుడు మరో 11 మంది మహిళా విద్యార్థులు అర్చక కోర్సును అభ్యసిస్తున్నారు. ఈ ముగ్గురిని సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
‘పైలట్లు, ఆస్ట్రోనట్లుగా మహిళలు దూసుకెళుతున్నప్పటికీ, దేవతలు పూజించబడే దేవాలయాల్లో వారిని అపవిత్రులుగా భావిస్తూ.. అర్చకత్వానికి అనర్హులుగా పేర్కొంటూ అతివలను నిరోధిస్తున్నారు. ఎట్టకేలకు మార్పు సంతరించుకుంది. తమిళనాడులో ద్రావిడ మోడల్ ప్రభుత్వం.. అన్ని కులాల వారిని పూజారులుగా నియమించడం ద్వారా పెరియార్ భావాలను సాధించాం, మహిళలు గర్బగుడిలోకి ప్రవేశిస్తున్నారనిరు. సమగ్రత, సమానత్వం కొత్త శకానికి తీసుకువస్తుంది’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. మహిళలు అర్చకులుగా దేవాలయాల్లోని గర్భగుడిలోకి ప్రవేశించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి