iDreamPost
android-app
ios-app

మ‌హిళల మోముల్లో ఆనందం.. ప్ర‌ముఖులు సైతం జ‌గ‌న్ కు నీరాజ‌నం

మ‌హిళల మోముల్లో ఆనందం.. ప్ర‌ముఖులు సైతం జ‌గ‌న్ కు నీరాజ‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి మ‌హిళ‌ల క‌ష్టాలు ఒక్కొక్క‌టిగా తీరుతూ వ‌స్తున్నాయి. ఒక్కో ప‌థ‌కం ద్వారా వారికి ఆర్థికంగా చేయూత‌నిస్తూ ఆయా కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని ఎప్పుడూ అంటుండేవారు. ఆయ‌న క‌ల‌ల‌ను త‌న‌యుడు జ‌గ‌న్ నిజం చేశారు. ఇప్ప‌టికే డ్వాక్రా రుణ‌మాఫీ, అమ్మ ఒడి, కాపు నేస్తం.. వంటి ప‌లు ప‌థ‌కాలతో ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌లు ఆర్థికంగా స్థిర‌ప‌డ‌డానికి ఆవ‌కాశాలు ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు తాజాగా మ‌హిళ‌ల పేరిట ఇళ్ల స్థ‌లాల పంపిణీ దేశం గర్వించ‌ద‌గ్గ ప‌థ‌కంగా నిలిచింది. ప‌ట్టాలందుకున్న మ‌హిళ‌ల ఆనందానికి హ‌ద్దుల్లేవు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను, మ‌హిళాభ్యుద‌యం కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న కృషిని గ‌మ‌నిస్తున్న వివిధ రంగాల మ‌హిళా ప్ర‌ముఖులెంద‌రో ఇళ్ల స్థ‌లాల పంపిణీ సంద‌ర్భంగా కీర్తించారు. ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు నివాసస్థల పట్టాలు ఇవ్వడమనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అధ్యాయమని వారు కొనియాడారు. అలాగే, అమ్మఒడి అద్భుత కార్యక్రమమని, దీని ద్వారా పిల్లలను చదివించే బాధ్యతను సీఎం జగన్‌ మహిళలపై పెట్టారని వారు ప్రశంసించారు. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులవుతారనే సత్యాన్ని గ్రహించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారని, ఇందుకు వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

మ‌హిళా సాధికారిత‌కు విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు

“సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత దోహదపడుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళల పేరుతో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుండటం ఆనందదాయకం. ఇది అందరూ గర్వించదగ్గ విషయం”. అని పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత పీవీ సింధు అన్నారు. “మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తోంది. అమ్మఒడి అద్భుత కార్యక్రమం. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్సార్‌ ఆసరా ఎంతో దోహదపడుతుంది. మహిళల పేరుతో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతుండటం ప్రశంసనీయం.” అంటూ అపోలో ఆస్పత్రి జేఎండీ సంగీత రెడ్డి కొనియాడారు. “రాష్ట్రంలో ప్రతి మహిళను లక్షాధికారిగా, మహారాణిగా చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళల పేరుతో ఆస్తి సమకూర్చే ఇళ్ల పట్టాలు ఇవ్వడం అభినందనీయం. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు” అని పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్ జమున ప్ర‌శంసించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అమ్మ ఒడి అమలు, ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయమ‌ని.. మెర్లిన్‌ ఫ్రీడా, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌.. అన్నారు. కర్ణాటక మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ ప్రమీలనాయుడు సైతం జ‌గ‌న్ కార్య‌క్ర‌మాల‌ను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమ‌ని చెప్పారు.