iDreamPost
android-app
ios-app

Women Emotional Speech, YS Jagan – ఓ మ‌హిళ భావోద్వేగం : జ‌గ‌న‌న్నా.. నీకు రుణ‌ప‌డి ఉంటా..!

Women Emotional Speech, YS Jagan – ఓ మ‌హిళ భావోద్వేగం : జ‌గ‌న‌న్నా.. నీకు రుణ‌ప‌డి ఉంటా..!

జ‌నం గుండెల్లో గూడుక‌ట్టుకోవ‌డం, వారి అభిమానం పొంద‌డం అంత తేలిక కాదు. సుదీర్ఘ కాలం పాలించినా అది అంద‌రికీ సాధ్యం కాదు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేవ‌లం రెండున్న‌ర ఏళ్ల కాలంలోనే ల‌క్ష‌లాది మందికి కొడుకుగా, అన్న‌గా, బంధువుగా వారి మ‌న‌సుల్లో నిలిచిపోతున్నారు. తాజాగా ఇంటి ప‌ట్టా పొందిన‌ ఓ మ‌హిళ భావోద్వేగాన్ని గ‌మ‌నిస్తే.. ఇలా ఎంత మంది పేద‌లు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి సొంతింటి కోసం అవ‌స్థ‌లు ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు.

పులివెందుల పర్యటనలో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల పట్టా పంపకాల సందర్భంగా లబ్ధిదారుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా పట్టాలు అందిస్తున్న తరుణంలో ఓ ఆడపడుచు మైకు అందుకుని భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా అందుకున్న సందర్భంగా సంక్రాంతి పండుగ చేసుకున్నట్లు ఉందని హుషారుగా మాట్లాడింది లబ్దిదారురాలు రేణుక. తన భర్త ఒక ఆటోడ్రైవర్‌ అని, సొంత ఇల్లు కోసం తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పిందామె. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా వచ్చిన జగనన్న.. ఇచ్చిన హామీకి కట్టుబడి పట్టాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపిందామె.

అంతేకాదు కరోనా కష్టకాలంలో నిర్లక్ష్యం చేయకుండా ఆదుకోవడం, నెలకు రెండుసార్లు రేషన్‌ ఇవ్వడం, ఇంకా ఇస్తుండడంపై రేణుక సంతోషం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఆసరాగా నిలిచిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సైతం ధన్యవాదాలు తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వైఎస్సార్‌ కుటుంబానికి మాత్రమే సాధ్యమని, పులి కడుపున పులే పుడుతుందని సంబరంగా మాట్లాడిందామె. ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా ఆడవాళ్ల రక్షణ కోసం చట్టం చేశారని తెలిపిందామె. చివరగా.. శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని పేర్కొందామె.

దీంతో పాటు.. క‌డ‌ప జిల్లా వాసిగా ఈ ప్రాంతంపై జ‌గ‌న్ చూపుతున్న ప్రేమ‌కు ఆ ప్రాంత‌వాసులు మంత్ర‌ముగ్దుల‌వుతున్నారు. స్థానికంగా జ‌రుగుతున్న అభివృద్ధిని, జ‌రిగిన క‌ష్ట‌న‌ష్టాల‌పై ఆయ‌న స్పందిస్తున్న తీరుకు శ‌భాష్.. జ‌గ‌న్ అని ప్ర‌శంసిస్తున్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జ‌గ‌న్ ఉద్వేగంగా మాట్లాడారు. 

‘ఇక్కడున్న సమస్యలు, పరిస్థితులు తెలిసిన వ్యక్తిని. ఈ జిల్లాలో ఏం జరిగినా అన్ని రకాలుగా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. గత నెలలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా రిజర్వాయర్‌లు తెగిపోయి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగింది. ఎంతో బాధనిపించింది. ఈ జిల్లా వాడిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక్క మాట చెబుతున్నాను. ఆ కుటుంబాలకు చనిపోయిన మనుషులనైతే తెప్పించలేను గానీ, ఆ కుటుంబ సభ్యులలో ఒకడిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ రోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాను. మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన‌డం ద్వారా ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్నారు.

Also Read : శాసనమండలిలో జగన్‌ కొత్త ట్రెండ్‌