iDreamPost
android-app
ios-app

మెట్రోలో బాలింతకు సీటు ఇవ్వలేదా ? వీడియో చూసి నెటిజన్లు ఫైర్ .. నిజమెంత ?

  • Published Jun 22, 2022 | 1:08 PM Updated Updated Jun 22, 2022 | 1:08 PM
మెట్రోలో బాలింతకు సీటు ఇవ్వలేదా ? వీడియో చూసి నెటిజన్లు ఫైర్ .. నిజమెంత ?

బస్సు, రైలు లేదా మెట్రో రైలు ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఏదైనా సరే వృద్ధులు, చంటిబిడ్డల తల్లులకు సీటివ్వడం కనీస మర్యాదను చాటుతుంది. వాళ్లు నిల్చుని ఉంటారులే.. మనమెందుకు సీటివ్వాలని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి అలవాట్లు, ఆలోచనలు సమాజానికి అంత మంచిది కాదు. తాజాగా.. ఓ మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని మెట్రో రైలులో నేలపై కూర్చుని ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆగ్రహానికి గురిచేస్తోంది. వీడియోలో పక్కనే సీట్లలో కూర్చుని ఉన్న ముగ్గురు యువతులు సెల్ఫోన్లు చూసుకుంటూ ఉండటం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మన సమాజం ఎటు వెళ్తోంది ? మానవత్వం, మర్యాద, సానుభూతి, సున్నితత్వం అనే మాటలకు అర్థాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ వీడియో పట్ల ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన చుట్టూ ఏమి జరుగుతుందో గమనించలేమా, మన కళ్ళు మన ఫోన్ స్క్రీన్‌లకు అతుక్కుపోయాయి. మీ ప్రవర్తనలో కనీస మార్పు లేకపోతే.. మీ డిగ్రీ కేవలం ఒక కాగితం ముక్కే అవుతుందని పేర్కొంటూ వీడియోను రీ షేర్ చేశారు. మరో నెటిజన్.. స్త్రీ ల పట్ల స్త్రీలకే గౌరవం, సానుభూతి లేనప్పుడు పురుషుల నుంచి ఏదీ ఆశించకూడదన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ వీడియోను చూసి ఫైర్ అవుతుంటే.. ఓ నెటిజన్ మాత్రం అందరికన్నా భిన్నంగా స్పందించాడు. ఈ వీడియో చాలా పాతదని, చిన్న క్లిప్ చూసి మొత్తం సీన్ ను ఎలా జడ్జ్ చేస్తారని ఫైరయ్యాడు. నిజానికి ఆ మహిళకు చాలామంది సీటు ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించింది. బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుంటేనే సౌకర్యంగా ఉందని చెప్పినట్లు ఆ నెటిజన్ పేర్కొన్నాడు.

చిన్న వీడియోను చూసి.. బిడ్డ తల్లి అయిన మహిళకు సీటు ఇవ్వలేదని చెప్పడం దారుణమన్నారు. నెటిజన్లంతా అదే నిజమని నమ్మడం కష్టమన్నారు. 2021లోనే యూట్యూబ్ లో ఇలాంటి వీడియో ఒకటి కనిపించడంతో.. అదే ఇదన్న వాదన నిజమే అనిపిస్తుందన్నారు. ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసేటపుడు అందులో నిజమెంత ఉందన్న విషయం తెలుసుకోవాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. నిజానికి ఆ మహిళకు మెట్రోలో సీటివ్వకపోతే.. వీడియో తీసిన వ్యక్తి సీటు ఇచ్చి ఉండవచ్చు కదా.. అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.