ఊబర్ డ్రైవర్ వేధింపులు.. లైవ్‌లో మహిళ కన్నీరు!

పట్టణాల్లో, నగరాల్లో బస్సుల్లో ప్రయాణాలు చేయాలంటే కష్టతరం అవుతోంది. బస్సుల కోసం గంటలు గంటలు వెయిటింగ్‌తో పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం, రష్ వల్ల చాలా మంది ప్రయాణీకులు ఇబ్బందులకు గురౌతున్నారు. దీన్ని క్యాష్ చేసుకున్నాయి కంపెనీలు. ఈ సమస్యలను క్యాష్ చేసుకునేందుకు పుట్టుకు వచ్చాయి ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు. అయితే ఇవి కస్టమర్లకు సేవలు అందించడంతో పాటు విమర్శల పాలు అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఊబర్ సంస్థకు చెందిన డ్రైవర్లు నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో అనేక సార్లు ఊబర్ డ్రైవర్లపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రయాణీకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ర్యాష్ డ్రైవింగ్ వంటివి ఆరోపణలు వచ్చాయి. మహిళా ప్రయాణీకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి.

ఇప్పుడు మరోసారి వివాదంలో నిలిచాడో డ్రైవర్. ఊబర్ డ్రైవర్ నుండి వేధింపులు ఎదుర్కొన్న మహిళా సోషల్ మీడియా ద్వారా  తన ఆవేదన వెళ్లగక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ మనాలి గుప్తా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వీడియో ద్వారా వెల్లడించింది. ‘నా కూతుర్ని స్కూల్ నుండి పికప్ చేసుకునేందుకు ఇటీవల ఊబర్ రైడ్ చేస్తుండగా.. ఫోన్‌లో కాల్ మాట్లాడుతున్నాను.. డ్రైవర్ ఆకస్మాత్తుగా తన ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. నేను ప్రతిఘటించబోతే.. దూషించాడు. వెంటనే భయపడి, కారును ఆపమని కోరాను. అయితే నా మాట పట్టించుకోకుండా కారు మరింత వేగంగా పోనిచ్చాడు. దీంతో కదులుతున్న కారు నుండి దూకేశాను. ఆ సమయంలో నా భద్రత దృష్ట్యా ఆ మార్గం తప్ప నాకు మరేమీ కనిపించలేదు’ అని తెలిపారు.

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు శ్యామ్ సుందర్ అనే డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ.. ఊబర్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడంతో.. వైరల్ అయ్యింది. దీంతో ఊబర్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. కాగా, తమకు ఊబర్, ర్యాపిడోలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. కొంత మంది భద్రత ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. మరికొంత మంది.. ఆమెకు న్యాయం జరగాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై ఊబర్ స్పందించాల్సి ఉంది.

Show comments