తెలంగాణ ప్రభుత్వం “భూమి వ్యవహారాల్లో” సంస్కరణ కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలో 2019 ఆగస్టు 1న విజయలక్ష్మి అనే మహిళ తనకున్న 1.34 ఎకరాల భూమిని జగదీష్ అనే వ్యక్తికి విక్రయించి రిజిష్టర్ చేశారు. జగదీష్ ఆ స్థలాన్ని తన పేరుపై మ్యుటేషన్ చేయించకుండా ప్లాట్లుగా మార్చి పలువురికి రిజిష్టర్ చేశారు.కాగా విజయలక్ష్మి గతంలో జగదీష్ కు విక్రయించిన భూమిని 2020 నవంబరు 4న తన కూతురు ప్రియాంక పేరున ధరణి ద్వారా రిజిష్టర్ చేయించి పాస్ బుక్ తీసుకున్నారు.
నాలా మార్పిడి అయిన వ్యవసాయేతరా భూమిని వ్యవసాయ భూమిగా పట్టాను,పాస్ బుక్ ను జారీ చేసిన అప్పటి గిర్దావర్ రామాంజనేయులు, వీఆర్వో నిరంజన్ ను సస్పెండ్ చేశామని, రిటైర్డ్ తహసీల్దార్ ఎండీ సమద్ పై చర్యలకు సీసీఎల్ కు సిఫార్సు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు.ఒకే భూమిని రెండుసార్లు రిజిష్టర్ చేసి మోసానికి పాల్పడిన విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.