Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ లో విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను టీఎంసీ కైవసం చేసుకుంది. 77 సీట్లతోనే బీజేపీ సరిపెట్టుకుంది. రాష్ట్రం అంతటా బీజేపీని మమత ఓడిస్తే.. నందిగ్రామ్ లో మమతను ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గంలో తనకు సాటి లేదని చాటి చెప్పారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన బంగాల్‌లోని నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. సువేందు మమతపై 1,956 ఓట్ల తేడాతో గెలిచారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై మమత ఆరోపణలు, ఫిర్యాదులు ఎలాగున్నా సువేందు గెలుపు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇద్దరూ ధీమాగానే ఉన్నప్పటికీ
పశ్చిమ బెంగాల్ లో మూడింట రెండొంతుల సీట్లతో తృణమూల్‌ను విజేతగా నిలిపిన మమతా బెనర్జీ అలియాస్ దీదీ తాను పోటీ చేసిన నందిగ్రామ్‌లో మాత్రం ఓటమి చవిచూశారు. 10 ఏళ్ల పాటు తనకు కుడి భుజంగా పని చేసిన సువేందు చేతిలో పరాజయం చెందారు. నందిగ్రామ్ ఉద్యమంలో మమత, సువేందు అధికారిదే కీలక పాత్ర. కానీ పార్టీపై అసంతృప్తితో.. ఎన్నికలకు కొద్ది నెలల ముందు సువేందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి మమత-సువేందు పోరు ఆసక్తిగా మారింది. సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్ నుంచే తానూ పోటీ చేస్తానని మమత ప్రకటించి దేశాన్ని ఆశ్చర్యానికి గురుచేశారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకున్నారు. వీరి మధ్య అనేకమార్లు మాటల తూటాలూ పేలాయి. గెలుపుపై ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు.
కారణాలు ఇవేనా..
నందిగ్రామ్ సువేందు అధికారి కంచుకోట. హోరాహోరీ పోరులో బీజేపీ పరిస్థితి రాష్ట్రం మొత్తం ఆశాజనకంగా లేకపోయినా ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించారు. కంచుకోటను సువేందు నిలబెట్టుకున్నారు. అందుకు అనేక కారణాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తృణమూల్ బలాలు, బలహీనతలన్నీ తెలిసి ఉండటంతో పాటు ‘నందిగ్రామ్ బిడ్డ’ను అంటూ సువేందు ప్రజల్లో పదే పదే ప్రస్తావించారు. మమతపై ‘బయటి మనిషి’ అని ప్రజల్లో ముద్ర వేయడంలో సఫలీకృతులయ్యారు. దీదీకి ఉన్న ప్రతికూలతలను తన అనుకూలతలుగా మలచుకుని ముందుకెళ్లారు సువేందు. ఇందుకో భాజపా పెద్దల నుంచి బలమైన మద్దతు కూడా లభించింది. సువేందు అధికారికి ఉన్న బ్యాక్ గ్రౌండ్‌తోపాటు సామాజిక నేపథ్యం లాంటీ పలు అంశాలు కలిసి వచ్చాయి.
గత రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో పాటు గత ఎన్నికల్లో టీఎంసీ తరుఫున పోటీ చేసిన ఆయన సుమారు 80 వేల ఓట్ల ఆధిక్యతను సాధించారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నందీగ్రామ్ పోరాటంలో మమత వెంట ఉన్న సువేందు అక్కడ పాగ వేశారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలు ఉండడం ఆయనకు అనుకూలంగా ఓట్లు పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆయన మమతా బెనర్జీ ప్రభుత్వంలో కాంగ్రెస్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడ చేసిన అనుభవం కూడా పని చేసిందని చెప్పొచ్చు. ఫలితంగా మెగా వార్లో విజేతగా నిలిచి మరోమారు తన సత్తా చాటారు సువేందు.