iDreamPost
android-app
ios-app

Brahmanandam : జంధ్యాల చెక్కిన నవ్వుల శిల్పం

  • Published Feb 01, 2022 | 9:45 AM Updated Updated Feb 01, 2022 | 9:45 AM
Brahmanandam : జంధ్యాల చెక్కిన నవ్వుల శిల్పం

అసలు బ్రహ్మానందమే లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా మీమ్స్ చాలా చప్పగా ఉండేవి. వందలు వేల సంఖ్యలో వీడియోలు, బ్రమ్మీ ఎక్స్ ప్రెషన్లతో స్టిక్కర్లు, ఇమేజులు ఒకటా రెండా సగటు మనిషి టెక్నాలజీ ప్రపంచంలో ఈయన ఒక భాగమయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్లకు థాంక్స్ చెప్పుకునే స్థాయిలో వాళ్ళు పాపులారిటీ తెచ్చుకున్నారంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. బ్రహ్మానందం పుట్టినరోజుని ఆన్ లైన్ లో ఒక వేడుకలా జరుపుకుంటున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సగటు టీవీ వినోదంలో బ్రమ్మీ లేని సినిమా కానీ కామెడీ సీన్ కానీ ఉండదంటే అబద్దం కాదు.

1956 గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటి వారి పాలెంలో ఫిబ్రవరి 1న కన్నెగంటి బ్రహ్మానందం జన్మించారు. తల్లితండ్రులు నాగలింగచారి – లక్ష్మినరసమ్మ గార్లు.స్కూల్ చదువు జరిగింది సత్తెనపల్లి శరభయ్య హై స్కూలులో. భీమవరంలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తయ్యాయి. గుంటూరులో తెలుగు సాహిత్యంలో MA పట్టా తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆసక్తి ఉన్నప్పటికీ చదువుకుని బుద్దిగా ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్లారు. తొమ్మిదేళ్లు అందులోనే ఉన్నారు. 1985లో శ్రీ తాతావతారం సినిమాలో మొదటిసారి మేకప్ వేసుకున్నారు. కానీ ముందు విడుదలయ్యింది మాత్రం జంధ్యాల తీసిన సీరియస్ డ్రామా సత్యాగ్రహం.

ఇవి పెద్దగా ఆడకపోవడంతో ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు బ్రహ్మానందం. 1987లో జంధ్యాల గారు పిలిచి మరీ ఇచ్చిన అహ నా పెళ్ళంట సినిమాలో అరగుండు వేషం ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లింది. మెల్లగా చిన్నా చితకా వేషాలతో మొదలుపెట్టి ప్రాధాన్యత కలిగిన పాత్రలు వేసుకుంటూ వెళ్లిన బ్రహ్మానందంకి 90వ దశకం స్వర్ణయుగం. చిత్రం భళారే విచిత్రం, మనీ, అసెంబ్లీ రౌడీ, అప్పుల అప్పారావు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఒకటా రెండా ఏడాదికి 40 సినిమాలు చేసే దాకా పరిస్థితి వచ్చిందంటే దర్శకులు హీరోలు నిర్మాతలు ఈయన్ని ఎంతగా కోరుకునేవారో అర్థం చేసుకోవచ్చు.

ఒకదశలో బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి సినిమాలు కూడా తీశారు. బాబాయ్ హోటల్, జోకర్ మామ సూపర్ అల్లుడు, పెళ్ళామా మజాకా లాంటివి అప్పట్లో మాస్ జనంలో సంచలనాలు. 1200 పైగా చిత్రాల్లో నటించిన అరుదైన రికార్డుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ఈ హాస్య చక్రవర్తికి 2010లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఇప్పటికీ నటనలో అలసిపోలేదు కానీ ఆయన స్థాయికి తగ్గ క్యారెక్టర్లు సృష్టించడంలో రచయితలు సఫలం కాలేకపోతున్నారు. యాక్టింగ్ లోనే కాదు చిత్రలేఖనంలోనూ బ్రహ్మానందం అద్భుత ప్రతిభ చూపిస్తారు. పలు సందర్భాల్లో ఆయన స్వయంగా చేత్తో వేసిన పెయింటింగ్స్ అందుకున్న సెలబ్రిటీలు విస్మయం వ్యక్తం చేశారు. ఎప్పుడు కలిసినా చెక్కుచెదరని నవ్వుతో నిత్యం పలకరించే బ్రహ్మానందం నిజంగా ధన్యజీవే