iDreamPost
android-app
ios-app

రాజ‌కీయాల్లో వంగవీటి రాధా త‌ప్ప‌ట‌డుగులు సరిదిద్దుకునేనా..!

రాజ‌కీయాల్లో వంగవీటి రాధా త‌ప్ప‌ట‌డుగులు సరిదిద్దుకునేనా..!

కాపు సామాజిక వ‌ర్గంలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందిన వ్య‌క్తి వంగ‌వీటి రంగా. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో 1988 డిసెంబర్ 26న రంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఇప్ప‌టికీ రంగా హ‌త్య‌ను రాజ‌కీయ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో లేవ‌నెత్తుతూనే ఉంటారు. రాజకీయంగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఎందుకంటే.. విజయవాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుతో పాటు, ప్ర‌త్యేక ఓటు బ్యాంకు ఉన్న కుటుంబం వంగవీటి రంగాది. కానీ.. అటువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన వంగ‌వీటి రాధా ఒక్క గెలుపుతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల రాధా మ‌ళ్లీ వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు.

రంగా వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా.. ఎప్పటికప్పుడు తీసుకుంటు న్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులతో తన కెరీర్ కు తానే బ్రేక్ వేసుకున్నాడ‌నే పేరు ఉంది. 2004లో తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేసినప్పుడు రంగాకున్న పేరుతో ఘన విజయం సాధించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ వెంటనే.. వచ్చిన ఎన్నికల్లో ఈ పార్టీ టికెట్పై పోటీ చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆతర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో.. రాధా. వైసీపీ వైపు మొగ్గు చూపారు. 2014లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అంటే.. వరుస పరాజయాలు పొందారు.

నిజానికి ఒక పరాజయం వచ్చినప్పుడే.. జాగ్రత్తగా ఉండాల్సిన నాయకుడు.. రెండు సార్లు పరాజయం పాలైనా.. తననుతాను సమీక్షించుకోలేక పోయారు. ఈ క్రమంలోనే.. వైసీపీతో వివాదం వచ్చేలా చేసింది. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేయండి.. అన్న పార్టీ పిలుపును పక్కన పెట్టి.. సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుబట్టారు. దీంతో పార్టీ ఈటికెట్ ఇవ్వనని చెప్పడంతో టీడీపీలోకి వచ్చారు. అయితే.. ఇక్కడ అసలు ఖాళీనే లేకపోవడంతో.. మౌనంగా ఉండిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ చెప్పిన‌ట్లుగా ఎక్క‌డి నుంచి పోటీ చేసినా రాధా క‌చ్చితంగా మ‌రోసారి ఎమ్మెల్యే అయ్యేవారు. కానీ ఆయ‌న తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యం ఆయ‌న‌ను ప‌ద‌వికి దూరం చేసింది. అయితే.. ఇప్పుడు మళ్లీ.. వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో సమావేశం కావడం.. దాదాపు రెండు గంటల పాటు .. ఇద్దరూ చర్చించుకోవడం.. వంటి పరిణామాలను గమనిస్తే.. మళ్లీ రాధా రాజకీయం మారుతోందనే వాదన వినిపిస్తోంది. అయితే. దీనిపై ఇప్పటి వరకు రాధా నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఆయన ఈ వార్తలను ఖండించలేదు. దీంతో రాధా రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎవ‌రికీ అంతు చిక్కడం లేదు. మ‌రి ఇక నుంచైనా స‌రైన మార్గం ఎంచుకుంటారా, లేదా చూడాలి.