Idream media
Idream media
హుజూరాబాద్ ఉప పోరుపైనే ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చ జరుగుతోంది. ఎన్నిక ఎప్పుడదనేది క్లారిటే వచ్చేయడంతో రాజకీయ పార్టీలన్నీ మరింత ఉత్సాహంతో ప్రజల్లో కలియతిరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలను మించి పోయేలా ఇక్కడి రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుధీర్ఘ కాలంగా ఉన్న ఈటల రాజేందర్ ఆరుసార్లు హుజూరాబాద్ లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ఆయన మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ కావడంతో బీజేపీలోకి చేరారు. అయితే కేవలం ఈటలను ఓడించాలన్న పట్టుదలతోనే టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ కేవలం ఉప ఎన్నిక కోసం పార్టీ ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది.
ఈటల రాజీనామా కు ముందు నుంచే.. హుజూరాబాద్ ప్రజలను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ఎప్పటి నుంచో వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గం ఓట్లను ముందే లెక్కించింది. నియోజకవర్గంలో 2 లక్షల 36 వేల ఓట్లుుండగా ఇందులో బీసీలు లక్షా 32 వేలు దళితులు 45 వేలు ఉన్నారు. మిగతా వారు ఇతర కులాలకు చెందిన వారుంన్నారు. మొత్తంగా ఇక్కడ ఎస్సీ బీసీ ఓట్లు అధికంగా ఉన్నాయని గుర్తించింది. అందువల్ల ముందుగా దళిత బంధు పథకంలో ఎస్సీ ఓట్లను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దళిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూరుస్తోంది. ఇక బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. గొర్ల పంపిణీ లాంటి పథకాలతో ఆ వర్గాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read : హుజూరాబాద్ రేసులో కాంగ్రెస్ ఎక్కడ?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ లేకపోతే వ్యక్తి శూన్యం అని చెప్పేందుకు పార్టీ నాయకులంతా కలిసి కట్టుగా నియోజకవర్గంలో మకాం వేశారు. నియోజకవర్గ బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించారు. ఆయన నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ లు కూడా రోజూ పర్యటన చేస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేలకు మండలం చొప్పున బాధ్యతలు అప్పగించడంతో వారు అక్కడి ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూరాబాద్ సీటును ఎలాగైనా వదులుకునే ప్రసక్తే లేదన్నట్లు పావులు కదుపుతుండగా.. బీజేపీ సైతం అందుకు తగ్గ పోటీనిస్తోంది.
స్థానికంగా ఈటలకు ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయనను ఓడించేందుకు తన శక్తియుక్తులను అన్నీ ఉపయోగిస్తోంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదనే సంకేతాలు పంపాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగాను, సంక్షేమం, అభివృద్ధి పరంగాను హుజురాబాద్ కు అధిక స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది. కుల సమీకరణాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మరి ఈ సమీకరణాలు ఓట్లను ఎంత వరకు రాలుస్తాయో వేచి చూడాలి.
Also Read : ఈసీ నిర్ణయం.. బండి సంజయ్ పాదయాత్రపై ప్రభావం