iDreamPost
android-app
ios-app

జిల్లాలు పెరిగాయి ,మరి నియోజకవర్గాలు కూడా పెరుగుతాయా?

  • Published Jan 26, 2022 | 11:34 AM Updated Updated Mar 11, 2022 | 10:21 PM
జిల్లాలు పెరిగాయి ,మరి నియోజకవర్గాలు కూడా పెరుగుతాయా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజనానంతర అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను ముక్కలు చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మంత్రివర్గ తీర్మానం చేసి అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జులై 15 , 2020 తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అప్పుడు తెలిసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వం జనవరి 25 ,2022 నాడు జిల్లాల పునర్విభజన పై గెజిట్ విడుదల చేసింది.

రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర , కోస్తా , రాయలసీమ ప్రాంతాల జిల్లాల విస్తీర్ణం , నియోజకవర్గాల సంఖ్యలు , జనాభా అంకెలు గమనిస్తే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు ఆయా జిల్లాల విస్తీర్ణంతో సంబంధం లేకుండా జనాభా సంఖ్యపై ఆధారపడి వుంటాయని మనకు తెలుస్తుంది. ఈ నియోజకవర్గాలు, ఆయా ప్రాంతాల జనాభాపై ఆధారపడి వుంటాయి.

భారత రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి జరిగే జనాభా గణాంకాల సేకరణ తర్వాత మారిన జనాభాకనుగుణంగా లోక్‌సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను , సరిహద్దులను సవరించాలి. ఇందుకు సంబంధించిన 82 , 170 ప్రకరణలను రాజ్యాంగంలో ప్రస్తావించారు. ఈ పునర్విభజన ప్రక్రియ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ద్వారా మాత్రమే జరుగుతుంది.

ఇంతవరకూ 1952, 1962, 1972, 2002లో నాలుగు పర్యాయాలు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. వాటి సూచన మేరకే పునర్విభజన జరిగింది. మొదటి లోక్‌సభలో (1952) మొత్తం సభ్యుల సంఖ్య 489 గా వుండేది. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు.

1976 లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్యోద్దేశం.. దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడటం. ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు.దీని అర్థం నియోజకవర్గాల విభజన ప్రక్రియ 2026 తరువాత మొదలయితే 2029 లో జరిగే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. 

ప్రస్తుత లోక్ సభ స్థానాలు కూడా 2002 లోని డిలిమిటేషన్ కమిషన్ సూచనల మేరకే వున్నాయి. 2009 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల ఏర్పాటు అనేది రాజ్యాంగపరంగా జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది కానీ విస్తీర్ణాల ఆధారంగా కాదనేది స్పృష్టం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల అధిక విస్తీర్ణం కలిగిన ప్రాంతాలు ఒక జిల్లా నుంచి రెండు జిల్లాల విభజనకు పరిమితం అయ్యాయి. మిగిలిన ప్రాంతాలు జనాభా ప్రాతిపాదికన ఏర్పాటైన అధిక పార్లమెంట్ సీట్లతో అధిక జిల్లాలు ఏర్పడి మంచి పాలనా సౌలభ్యం కలిగి ఉంటాయి.

అందుకే కేవలం పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే కొత్త జిల్లాలు అనే కాన్సెప్ట్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఇటువంటి క్రియాశీలక నిర్ణయాలు శాశ్వతంగా ఉండిపోయేవి కాబట్టి ప్రభుత్వం అందరూ మెచ్చేలా మార్పులు చేర్పులు చేయడం ఎంతో అవసరం. లేదంటే కొన్ని జిల్లాల ప్రజల అసంతృప్తి అలాగే కొనసాగుతూ ఉండక తప్పదు.

స్థూలంగా పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల ఆధారంగా కొద్దిపాటి మార్పులతో జిల్లాల ఏర్పాటుతో చాలావరకు ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. దీనికి అదనముగా భౌగోళిక పరిస్థితులు ఆధారంగా రెండు మూడు జిల్లాలను కూడా ఏర్పాటు చేయవలసి ఉంది.మొత్తంగా జిల్లాల ఏర్పాటు శాసనసభ మరియు లోక్ సభ స్థానాలసంఖ్య మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవు.