iDreamPost
android-app
ios-app

నానితో పోటీ పడేంత సీన్ ఉందా

  • Published Feb 25, 2021 | 6:50 AM Updated Updated Feb 25, 2021 | 6:50 AM
నానితో పోటీ పడేంత సీన్ ఉందా

ఎంత వద్దనుకున్నా బాక్సాఫీస్ వద్ద ప్రతి శుక్రవారం క్లాషులు తప్పడం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత థియేట్రికల్ రిలీజులు సిద్ధం కావడంతో విపరీతమైన పోటీ అనివార్యమవుతోంది. అంతో ఇంతో క్రేజ్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ చిన్న బడ్జెట్ మూవీస్ మాత్రం వచ్చిన దాని కన్నా వేగంగా వెళ్లిపోతున్నాయి. ఇక వచ్చే అక్టోబర్ దాకా ఇప్పటినుంచే షెడ్యూల్ వేసుకుని విడుదల తేదీ మీద కర్చీఫ్ వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అలా అని ఇంకెవరూ రారు అని చెప్పడానికి ఎలాంటి గ్యారెంటీ లేదు. అంత పెద్ద రాధే శ్యామ్ నే డోంట్ కేర్ తరహాలో నిన్న గంగూబాయ్ డేట్ ని అదే జులై 30కి లాక్ చేయడం ఇప్పటికే ట్రేడ్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా ఏప్రిల్ 23 న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ అనూహ్యంగా మాస్ అంశాలు కూడా కలిగి ఉండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఏదో సాఫ్ట్ ఎంటర్ టైనర్ అనుకున్న వాళ్ళ లెక్కలను రివర్స్ చేస్తూ మంచి యాక్షన్ డ్రామా చూడొచ్చనే భరోసా ఇచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ తన మొదటి రెండు సినిమాల శైలికి భిన్నంగా మాస్ సబ్జెక్టును ట్రై చేయడం ఆసక్తి రేపుతోంది. అయితే నిన్న కంగనా రౌనత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న తలైవి విడుదల కూడా అదే ఏప్రిల్ 23 అని ప్రకటించేశారు. ఇది తమిళం తెలుగు మలయాళం భాషల్లో రానుంది.

అయితే తలైవికి టక్ జగదీశ్ కు గట్టి పోటీ ఇచ్చేంత సీన్ ఉందా అంటే తెలుగు రాష్ట్రాల వరకు లేదనే చెప్పాలి. ఎందుకంటే తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందింది. మన ఆడియన్స్ కి ఆవిడతో కనెక్టివిటీ తక్కువ. సినిమా బాగున్నా మరీ అద్భుతాలు చేసే రేంజ్ కి వెళ్లకపోవచ్చు. కాకపోతే అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్, జిస్సు సేన్ గుప్తా లాంటి క్యాస్టింగ్ ఆసక్తిని రేపుతోంది. కానీ టక్ జగదీశ్ కు బయటి రాష్ట్రాల్లో కొంత ఇబ్బందులు తలైవి వల్ల తప్పకపోవచ్చు. అసలే లవ్ స్టోరీ కోసం 16ని త్యాగం చేసి 23కి వచ్చిన నాని సినిమాను ఇప్పుడు కంగనా రౌనత్ టార్గెట్ చేసింది. ఇలాంటి పోటీలు ఇకపై చాలా సహజం కాబోతున్నాయి