iDreamPost
android-app
ios-app

పరిషత్‌ ఎన్నికలు మళ్లీ జరిగితే.. టీడీపీ పోటీ చేస్తదా..?

పరిషత్‌ ఎన్నికలు మళ్లీ జరిగితే.. టీడీపీ పోటీ చేస్తదా..?

సుప్రిం కోర్టు నిబంధనల ప్రకారం నాలుగు వారాల ఎన్నికల కోడ్‌ అమలు చేయలేదంటూ పోలింగ్‌ పూర్తయిన పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ మళ్లీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం డివిజనల్‌ బెంచ్‌కు లేదా సుప్రిం కోర్టుకు వెళ్లడం ఖాయం. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ మళ్లీ జరుగుతుందా..? లేదా..? అనేది తేలుతుంది. అప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేం.

ఈ విషయం పక్కన పెడితే.. కోడ్‌ పాటించలేదంటూ కోర్టుకు వెళ్లిన టీడీపీ నేత, ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏం సాధించారు..? టీడీపీ ఇప్పుడు ఏం చేయబోతోంది..? అనే అంశంపై చర్చించాల్సిన సమయం ఇది.

2020 మార్చిలో మొదలైన పరిషత్‌ ఎన్నికలు నామినేషన్ల దాఖలు, పరిశీలన, తుది జాబితా వరకు సాగిన తర్వాత కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అనేక పరిణామాల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆధ్వర్యంలో పరిషత్‌ ఎన్నికలు ఎక్కడ ఆగాయో తిరిగి అక్కడ నుంచే మొదలయ్యాయి. నీలం సాహ్ని అంతకు ముందు ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ సలహాదారుగా పని చేశారు. ఈ కారణాల చేత.. నీలం సాహ్ని ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికల్లో తమకు న్యాయం జరగదని, పక్షపాతం చూపిస్తారనే సాకులు చెబుతూ.. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

నామినేషన్లు దాఖలై, తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత.. బ్యాలెట్‌ పేపర్‌పై టీడీపీ అభ్యర్థుల పేర్లు, గుర్తులు ముద్రించడం పూర్తయినా.. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. టీడీపీ అధినేత ప్రకటన అలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. టీడీపీ స్థానిక నేతలు ఎక్కడికక్కడ పోటీలో నిలుచున్నారు. తమ క్యాడర్‌ను, వర్గాన్ని కాపాడుకునేందుకు బరిలో నిలిచారు.

కౌంటింగ్‌ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై క్లారిటీ వస్తుందని అందరూ ఆశించగా.. పోలింగ్‌నే రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఎన్నికలు ఆగాయో.. తిరిగి అక్కడ నుంచే నిర్వహించేలా కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆ తీర్పులో పేర్కొంది. రేపు ఏమి జరుగుతుందనే అంశం పక్కనపెట్టి.. ఈ తీర్పు ఆధారంగానే ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైతే.. టీడీపీ పరిస్థితి ఏమిటి..? అనేదే ప్రశ్న.

నీలం సాహ్ని ఎస్‌ఈసీగా ఉంటే తమకు న్యాయం జరగదంటూ చెబుతూ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.. రేపు మళ్లీ పోలింగ్‌ నిర్వహిస్తే పోటీలో ఉంటుందా..? పక్రియ ఆగిన చోట నుంచి అంటే.. ఎవరు నామినేషన్‌ దాఖలు చేశారో..? వారే ఆయా పార్టీల తరఫున బరిలో ఉంటారు. ఏకగ్రీవాలు మినహా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మరి రెండు నెలల క్రితం జరిగిన పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.. రేపు మళ్లీ పరిషత్‌ ఎన్నికలు జరిగితే.. పోటీ చేస్తుందా..? లేదా మునపటి మాటపై నిలబడుతూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామనే నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా..? అనేదే టీడీపీ నుంచి క్లారిటీ రావాలి.

Also Read : శవ రాజకీయం అంటే ఇదేనా..?