Idream media
Idream media
సర్పంచ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సవాళ్లు గుర్తున్నాయో లేదో..! ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతోందని, దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని ఆ పార్టీ నేతలు తెగ చాలెంజ్ లు విసిరారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందనే ఎన్నికలకు వెనుకడుగు వేస్తోందంటూ తెగ స్టేట్ మెంట్ లు ఇచ్చారు. కట్ చేస్తే.. ఎన్నికలు జరిగాయి. ఎవరిపై వ్యతిరేకత ఉందో ఫలితాల్లో తేలిపోయింది. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత.. అధినేత చంద్రబాబు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు వరకు ఓ డిమాండ్ ను లేవనెత్తుతున్నారు. చెప్పాలంటే ఇదే మొదటిసారి కాదనుకోండి. అదేంటంటే.. దమ్ముంటే.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని..!
జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేదు కాబట్టే.. వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయని పేర్కొంటూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. ఆ ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాళ్లు విసిరారు. దీనిపై టీడీపీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. సపోజ్.. ఫర్ సపోజ్.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలే వస్తే.. చంద్రబాబు కానీ టీడీపీ నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారా? అసలు అన్ని స్థానాల్లోనూ మనం పోటీ చేయగలరా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికలు జరిగి కేవలం ఇరవై నాలుగు నెలలే జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జరిగిన దెబ్బ మామూలుది కాదు. పట్టుమని ముప్పై సీట్లు కూడా సాధించలేకపోయారు. దీంతోఓ అప్పటి నుంచి అనేక మంది నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంత మంది దూరం అయిపోయారు. రాజకీయంగా, ఆర్థికంగా కూడా పార్టీలో చాలా మంది నేతలు ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: నేటి నుంచే అసెంబ్లీ : రాజకీయ దుమారం ఖాయం!
మునిసిపల్ ఎన్నికలే నిదర్శనం. ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించలేదు కదా! అయినప్పటికీ.. అభ్యర్థులకు అంతో ఇంతో నిధులు సమకూర్చాల్సిన అవసరం వస్తే.. నాయకులు చేతులు ఎత్తేశారు. మరి మునిసిపాలిటీలు కార్పొరేషన్లలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే.. పార్టీలో ఖర్చు చేసేవారు ఎవరు ఉన్నారు? అనేది ప్రశ్న. పోనీ.. పార్టీనే సమకూర్చుతుంది అనుకున్నా.. ఇప్పుడు వైసీపీ ఉన్న పరిస్థితుల్లో గట్టి పోటీ ఇచ్చే వారు ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు? మరోవైపు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో నాయకుల లేమి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా వస్తాయంటావా అనే సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి.
మరోవైపు.. సంక్షేమ పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లబ్ధిదారులే. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వారేర. సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఇదిలా ఉంటే.. టీడీపీ అంతర్గత కుమ్ములాట్లో కొట్టుమిట్టాడుతోంది. విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు వంటి మహానగరాల్లో కూడా అదే పరిస్థితి. అలాంటప్పుడు అసెంబ్లీ రద్దయితే.. నష్టపోయేది టీడీపీనేనని మెజార్టీ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి. అగ్రనేతలు ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:దేవాదాయశాఖను రద్దు చేస్తామంటున్న సోము వీర్రాజు