iDreamPost
android-app
ios-app

నామినేషన్ దాఖలు : ప‌న‌బాక‌లో మార్పు క‌నిపించేనా..?

నామినేషన్ దాఖలు : ప‌న‌బాక‌లో మార్పు క‌నిపించేనా..?

తిరుప‌తిలో తెలుగుదేశం పార్టీ పరిస్దితి చాలా విచిత్రంగా ఉంది. లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేస్తుందని చంద్రబాబునాయుడు ఎప్పుడో ప్ర‌క‌టించేశారు. దాదాపు నాలుగు మాసాల క్రితమే అభ్యర్ధిని ప్రకటించినా ప‌న‌బాక ల‌క్ష్మి ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేదు. క‌నీసం పార్టీ సీనియ‌ర్ల‌ను కూడా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన దాఖ‌లాలు లేవు.

మొదట్లో కూతురు వివాహమని అంతకుముందు దానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నార‌ని ప‌న‌బాక అనుచ‌రులు చెబుతూ వ‌చ్చారు. జ‌న‌వ‌రిలో వివాహం అయిపోయింది. ఆ త‌ర్వాత కూడా ఆమె రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌లేదు. కొద్ది రోజుల క్రితం మంగ‌ళ‌గిరిలో స‌మావేశం నిర్వ‌హించిన చంద్ర‌బాబు ఆమె త్వ‌ర‌లో ప్ర‌చారానికి దిగుతున్నార‌ని తేదీల‌ను కూడా ప్ర‌క‌టించారు. అయినా ప్ర‌చారంలో ముందుకు రాలేదు కానీ, నాడు చెప్పిన తేదీ మేర‌కు ప‌న‌బాక ల‌క్ష్మి టీడీపీ అభ్య‌ర్థిగా తిరుప‌తి లోక్ స‌భ‌కు నామినేష‌న్ మాత్రం దాఖ‌లు చేశారు. దీంతో ఇప్ప‌టికైనా ప‌న‌బాక‌లో మార్పు వ‌చ్చేనా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2019 ఎన్నికల్లో కూడా ఆమె తెలుగుదేశం టికెట్ పైనే పోటీ చేశారు. 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక త‌న ప‌ని అయిపోంది అన్న‌ట్లుగా ఆమె ఆ త‌ర్వాత నియోజకవర్గం క‌నిపించ లేదు. దీంతో మొహం చాటేశార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు. నిజానికి ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజలకుచేరువ కావడం అనేది నాయకులకు అత్యంత అవసరం. అప్పుడే వారి ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుంది. కానీ… పనబాక మాత్రం మళ్లీ ఐదేళ్లకు కదా.. ఎన్నికలు.. అప్పుడు చూసుకుందాం.. అనుకున్నారు. ఫలితంగా ఇటు నియోజకవర్గానికి ఆమె దూరమయ్యారు.

కానీ అనూహ్యంగా రెండేళ్లలోనే ఇక్కడ ఉప పోరు రావడం.. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి పనబాకకే ఇక్కడ సీటు కేటాయించడం జ‌రిగింది. ఈ విషయంలో ఆదిలో పనబాక ఆనందించారు. అయితే.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన తర్వాత.. మాత్రం ఆమెలో ఆందోళన మొదలైందని అంటున్నారు పరిశీలకులు. ఆ ఆందోళ‌న‌తోనే ప్ర‌చారంలోకి వెళ్లేందుకు వెనుక‌డుగు వేస్తున్నార‌ని భావిస్తున్నారు.

ఇంత కాలం ఎలా ఉన్నా ఇప్పుడు నామినేష‌న్ వేశారు కాబ‌ట్టి ప్ర‌చార తీరు మారుతుందా లేదో చూడాలి. ఆమె ఇంత వ‌ర‌కూ పార్టీలోని కొందరు సీనియర్లను క‌ల‌వ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి ప్రచారంలోకి దిగేశారు. ఈయనకు మద్దతుగా మంత్రులు ఎంఎల్ఏలు ఎంపిలు నేతల్లో కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు.

అధికారపార్టీయే అభ్యర్ధితో ప్రచారానికి దిగినపుడు ప్రతిపక్ష అభ్యర్ధి మాత్రం ఇంకా ఎందుకని ప్రచారంలోకి దిగలేదో పార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. మొదటినుండి ఈమెకు పోటీ చేయటం ఇష్టం లేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. తాను బిజీగా ఉన్న కారణంగా తన తరపున ప్రచారం చేయాలని ఆమె గ‌తంలో కొంద‌రు సీనియ‌ర్ల‌ను కోరార‌ట‌. అభ్యర్ధే బిజీగా ఉన్నపుడు తాము చేసే ప్రచారం ఏముంటుంది ? అన్న పద్దతిలో టీడీపీ నుంచి ఎవ‌రూ ప్రచారంలోకి దిగలేదు. దీంతో అసలు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం నుంచి నామినేష‌న్ దాఖ‌లు వేసే వ‌ర‌కూ ప‌న‌బాక వ‌చ్చారు. దీంతో ఇప్ప‌టికైనా ప్ర‌చార‌శైలిలో ఆమెలో మార్పు వ‌స్తుందా, లేదా అనేది చూడాలి.