iDreamPost
android-app
ios-app

కాలం కలిసొచ్చేనా కళావతి మంత్రి అయ్యేనా ?

  • Published Aug 12, 2021 | 6:40 AM Updated Updated Aug 12, 2021 | 6:40 AM
కాలం కలిసొచ్చేనా కళావతి మంత్రి అయ్యేనా ?

విశ్వాసరాయి ఆమె ఇంటి పేరు. అందుకు తగినట్లే తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి.. గెలిపించిన ప్రజలకు విశ్వాసపాత్రురాలిగా మెలుగుతున్నారు. ఇంటి పేరును సార్ధకం చేస్తున్నారు. ఎంతో పేరున్న దొరల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎటువంటి భేషజాలు, ఎమ్మెల్యేనన్న దర్పం ఏమాత్రం లేకుండా చాలా నిరాడంబరంగా ఉంటూ.. ప్రజలతో కలిసిపోతుంటారు. అందుకే ఆమెను శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ ప్రజలు వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీతో గెలిపించారు. అంతవరకు ఆధిపత్యం వహించిన తెలుగుదేశానికి చెక్ పెట్టారు.

దొరల కుటుంబం నుంచి ప్రజా జీవితంలోకి

ప్రస్తుతం పాలకొండ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వాసరాయి కళావతి వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందినవారు. ఆమెది గిరిజన దొరల కుటుంబం. ఆమె తండ్రి విశ్వాసరాయి నరసింహారావు వండువ దొరగా ప్రసిద్ధులు. శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో వండువ దొర కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వండువ దొర గతంలో స్వతంత్ర పార్టీ నుంచి పార్వతీపురం ఎంపీగా.. ఆ తర్వాత జనతా పార్టీ నుంచి కొత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

అనంతరం కాంగ్రెసులో చేరి 1985లో కొత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమార్తె అయిన కళావతి ఎం ఏ చదివి మొదట ఆర్టీసీలో, తర్వాత సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేశారు. తండ్రి బాటలో రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకొని ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికారు. సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా 20 శాతం ఓట్లు సంపాదించారు.

జగన్ తొలి మద్దతుదారుల్లో ఒకరిగా..

ఎన్నికల్లో పరాభవం ప్రజారాజ్యం పార్టీని నిర్వీర్యం చేయడంతో ఆ పార్టీకి కళావతి రాజీనామా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వై.ఎస్.జగన్ కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ జగన్ నాయకత్వానికి గట్టి మద్దతుదారుగా, విధేయురాలిగా కొనసాగుతున్నారు. 2014లో పార్టీ అభ్యర్థిగా పాలకొండ నుంచి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 11 వేల ఆధిక్యంతో గెలిచారు. ఆ విధంగా నియోజకవర్గంలో టీడీపీ హవాకు బ్రేక్ వేశారు. 2019 ఎన్నికల్లోనూ నిమ్మక జయకృష్ణపైనే మరింత మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో 54 శాతం ఓట్లతో 18 వేల మెజారిటీ లభించింది.

ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ కళావతి ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరాడంబరంగా ఉంటూ ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఆమె ధాటికి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోతోంది. పార్టీ ఇంఛార్జి నిమ్మక జయకృష్ణతో సహా ఇతర నాయకులు జాడ లేకుండా పోయారు. మచ్చ లేని నాయకురాలిగా పేరొందిన కళావతి ముందు టీడీపీ కళావిహీనంగా కనిపిస్తోంది. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ కు మొదటి నుంచి విధేయురాలిగా ఉంటున్నా మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై కళావతి అనుచరవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ఆమె తర్వాత పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చి ఆమెను విస్మరించడం తగదని అంటున్నారు. త్వరలో జరగనున్న విస్తారణలోనైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే కళావతి మాత్రం పదవులు రాలేదన్న నిరాశకు గురికాకుండా పార్టీ, ప్రజల అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తున్నారు.