Idream media
Idream media
గత రెండు పర్యాయాలు దేశంలో విజయ విహారం చేసిన బీజేపీని మూడోసారి ఎలాగైనా మట్టికరిపించాలని విపక్షాలు ఉబలాటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే ఢిల్లీ పర్యటించి బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా విపక్ష పార్టీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సాగిన ఈ భేటీలో కేంద్రానికి వ్యతిరేకంగా సమరానికి పిలుపునిచ్చారు. అయితే ఈ ఐక్యత వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతుందా, పార్లమెంట్ సమావేశాలకే పరిమితమవుతుందా?
కేంద్రంలోని బీజేపీ రెండో సారి అధికారంలోకి రాక ముందు కూడా.. ఆ పార్టీ ప్రాబల్యం తగ్గిందని, మోదీ ఆకర్షణ కోల్పోయారన్న ప్రచారాన్ని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు లేవనెత్తాయి. బీజేపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని పదే పదే ప్రచారం చేశాయి. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు బీజేపీకే మళ్లీ పట్టం కట్టారు. గతం కంటే ఎక్కువగానే ఆదరించారు. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ చావు తప్పి కన్ను లొట్టపోయిందంత పనైంది. ఆ స్తబ్ధత రెండేళ్ల పాటు అలాగే ఉంది. నూతన వ్యవసాయ చట్టాలపై పెల్లుబికుతున్న వ్యతిరేకత, కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రతికూలంగా ఉండడడం, ప్రధానంగా హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ లో ఘోరంగా ఓడిపోవడంతో విపక్ష పార్టీలు మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తరచూ భేటీలవుతున్నాయి. కొత్త పొత్తుల ఊహాగానాలను సృష్టిస్తున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దూకుడు పెంచుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సమరానికి సిద్ధమయ్యారు. తాజాగా ప్రతిపక్ష ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ, శివసేన, వామపక్షాలు సహా 14 పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. విపక్ష సభ్యులతో కలిసి జంతర్‌మంతర్‌కు చేరుకుని వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. వారితో కలిసి అన్ని పార్టీల ప్రధాన నాయకులూ నిరసనలో పాల్గొనడం ఆకర్షణీయంగా మారింది. సేవ్ ఫార్మర్స్..సేవ్ ఇండియా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, ద్రవ్యోల్బణం అంశాలపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబట్టిన విపక్షాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. దీంతో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధ్యక్షతన విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అంబికాసోనీ, గౌరవ్ గొగోయ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, డీఎంకే నేత టీ శివ తదితరులు పార్లమెంటు ఆవరణలో సమావేశమై.. కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేవరకు ఉమ్మడి పోరాటం ఆపకూడదని డిసైడయ్యారు. అయితే, అది ఇంతటితో ఆగిపోతుందా? మున్ముందు కూడా కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. మరి భవిష్యత్ రాజకీయచట్రం ఎలా ఉంటుందో చూడాలి.