iDreamPost
android-app
ios-app

Will Not Let Farmers Die by Suicide – మంచి మాట కేజ్రీవాల్‌… అదే జరిగితే దేశం మీకు జై కొడుతుంది..

Will Not Let Farmers Die by Suicide – మంచి మాట కేజ్రీవాల్‌… అదే జరిగితే దేశం మీకు జై కొడుతుంది..

సందర్భం ఎన్నికలైనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ మంచి మాట చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా.. రైతులు ఆత్మహత్యల గురించి రోజూ వింటున్నామన్నారు. ఇది మనందరికీ సిగ్గుచేటన్నారు కేజ్రీవాల్‌. పంజాబ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత పంజాబ్‌లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని కేజ్రీవాల్‌ చెప్పారు. ఇందు కోసం తాము ఎందాకైనా వెళతామన్నారు. ఏదైనా చేస్తామన్నారు. పంజాబ్‌లో వ్యవసాయం గురించి తాము పెద్ద ప్రణాళిక వేశామని చెప్పారు. మరో నెల రోజుల్లో మళ్లీ పంజాబ్‌ వస్తానని, అప్పుడు ఆ ప్రణాళికను వివరిస్తానని చెప్పారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో పంజాబ్‌ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేజ్రీవాల్‌ ఈ మాటలు చెప్పారు. బలంగా హామీ ఇచ్చారు. ఇది ఓట్ల కోసం చేసిన రాజకీయమైనా.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు పంజాబ్‌ రైతుల్లోనూ కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల్లోనూ ఆశలు రేపాయి.

దేశంలో రైతులు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. దశాబ్ధాలు గడుస్తున్నా.. పాలకులు, ప్రభుత్వాలు మారినా.. రైతుల తలరాతలు మాత్రం మారలేదు. దేశాన్ని బతికించేందుకు స్వేదం చిందించే రైతన్న.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. తెలిసి ప్రాణాలు తీసుకుంటున్నాడు.

Also Read : YCP MPs Meet CEC – టీడీపీ మొదలుపెట్టింది.. వైసీపీ ముగించింది..

బ్యాంకుల నుంచి వందల, వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే వ్యాపారస్తులు, దేశంలోనే రాజకీయ నేతలుగా చెలామణి అయ్యే వారి తీరులో ఒక్కశాతం రైతన్నకు అబ్బినా ఆత్మహత్య చేసుకునేవాడు కాదేమో. వ్యవసాయం చేసేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు పొలం, పుస్తెలు అమ్మినా తీరక.. అప్పు తీర్చే పరిస్థితి లేక, బతికేందుకు మార్గం కానరాక, పరువు కోసం, మాట పడలేక తెలిసి తెలిసి ప్రాణాలు తీసుకుంటున్నాడు.

ఇలాంటి దుస్థితిలో ఉన్న రైతన్నను.. కాపాడతానని, ఆత్మహత్య చేసుకోనివ్వనని కేజ్రీవాల్‌ చెప్పడం హర్షించదగ్గ విషయం. ఇంతకు ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఓట్ల పండగల సమయంలో పలువురు నేతలు చేశారు. కొంత మంది శక్తిమేరకు మంచి చేశారు. మరికొంత మంది మాటలు నీటిమూటలయ్యాయి. ఏమైనా.. రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగలేదు. ఒక మనిషి తెలిసి ప్రాణాలు తీసుకోవడమే అత్యంత బాధాకరమైన, హృదయం ద్రవించే విషయం. ఆ పరిస్థితిని మార్చుతానని కేజ్రీవాల్‌ చెప్పారు. అదే జరిగితే దేశం మొత్తం కేజ్రీవాల్‌కు సెల్యూట్‌ చేస్తుంది.

కేజ్రీవాల్‌ ఏం చేయబోతున్నారనేది మరో నెలరోజుల్లో తెలుస్తుంది. వ్యవసాయం కోసం ఆయన వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో వెల్లడవుతుంది. పంజాబ్‌లో 117 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ 20 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్దపార్టీగా నిలిచింది. ఈ సారి ఎన్నికల్లో గెలుస్తారా..?లేదా..? అనేది మార్చిలో తేలుతుంది. కేజ్రీవాల్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు మంచి చేస్తారనే నమ్మకం అయితే ఉంది. అందుకు ఆయన ఢిల్లీలో ఏడేళ్లుగా సామాన్యుల సంక్షేమమే లక్ష్యంగా సాగిస్తున్న పరిపాలనే నిదర్శనం. మరి పంజాబ్‌ ఓటర్లు కేజ్రీవాల్‌ పార్టీకి అవకాశం ఇస్తారా..? లేదా..? చూడాలి.

Also Read : Prashant Kishor – BJP : 40 ఏళ్లు బీజేపీనే.. పీకే వ్యూహాలే కాదు మనిషి కూడా అర్థం కాడు