iDreamPost
iDreamPost
కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ రూపకల్పనకు సిద్ధం అవుతోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దానికి సంబంధించిన సన్నాహాలు పూర్తి చేశారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై పడింది. ఈసారి కేటాయింపుల విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, ఏ రాయితీలు ఇస్తుందనే దానిపై చర్చ మొదలయ్యింది.
ప్రతీసారి ఆదాయపుపన్ను రాయితీల విషయంలో మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు ఆశాభావంతో ఎదురుచూడడం, ప్రభుత్వాలు అరొకర ప్రయోజనాలు తప్ప సంతృప్తినిచ్చేందుకు సిద్ధం కాకపోవడం చూస్తూనే ఉన్నాం. ఈసారి బడ్జెట్ లో కరోనా అనంతరం మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ మందిని దృష్టిలో పెట్టుకుని పన్ను రాయితీలు కల్పిస్తారని ఆశిస్తున్నారు. ముఖ్యంగా రూ. 5లక్షల లోపు వారికి ఉపశమనం కల్పించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కేంద్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయంలో కోతకు అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపుల విషయంలో గత ఏడాది ఆత్మనిర్బర్ ప్రాజెక్ట్ పేరుతో రూ. 20లక్షల కోట్లు కరోనా సహాయం కింద పంపిణీ చేసినట్టు ప్రచారం సాగింది. దాని ప్రయోజనాలు, ఫలితాలు ఈ బడ్జెట్ లో ఏమేరకు ప్రతిఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది. పారిశ్రామికరంగంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు కుదేలవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వాటికి ఉపశమనంతో పాటుగా వ్యవసాయానికి కేటాయింపుల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది కీలకం కాబోతోంది.
తెలుగింటి కోడలయిన నిర్మలా సీతారామన్ వరుసగా మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ గత రెండేళ్లలో ఆమె రాష్ట్రానికి చేసిన మేలు పెద్దగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో చిన్నచూపు కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా పీపీఏ, సీడబ్ల్యూసీ కూడా అంగీకరించినప్పటికీ పెంచిన అంచనాలకు ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తోది. 2017 నాటి అంచనాలకు ఆమోదం లభిస్తే ప్రాజెక్ట్ పూర్తికి ఆస్కారం ఉంటుంది. దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏమేరకు అంగీకరిస్తుందో చూడాలి. ఇక రాష్ట్రానికి రెవెన్యూ లోటు, వెనుక బడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు, రాజధాని నిర్మాణం కోసం నిధులు వంటి విషయాల్లో ఈ బడ్జెట్ లో సానుకూల స్పందన వస్తుందనే ఆశాభావం కనిపిస్తోంది.
విశాఖ రైల్వే జోన్ కూడా కేవలం ప్రకటనలకు పరిమితం అయిపోయింది. రెండేళ్లుగా పట్టాలెక్కిన దాఖలాలు లేవు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ లో కేటాయింపులు చేసి, రైల్వే జోన్ కి మోక్షం కలిగించాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఇప్పటికే ఏపీ సీఎం, ఆర్థికమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వానికి నేరుగా వినతిపత్రాలు అందించారు. వాటికి అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే విషయంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం సమావేశం జరగబోతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాడేపల్లిలో జరగబోతున్న సమావేశంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి నిధుల కోసం చేయాల్సిన ప్రయత్నాలపై చర్చ జరగబోతోంది.