iDreamPost
iDreamPost
మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర గెలుపు కోసం కాస్త సైలెంట్ గా కష్టపడుతున్న వాళ్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా,భారతీయ జనతాపార్టీలో అధికారికంగా జాయిన్ అవ్వకపోయినా సరే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ ను ఎలా అయినాసరే గెలిపించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా నెల రోజుల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ కోసం తన సన్నిహితులతో మాట్లాడటమే కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గం క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని సూచనలు సలహాలు ఇస్తున్నారు.
రాజకీయంగా అధికార పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది ,ఏమిటనే దానిపై ఆయన పక్కా ప్రణాళికలు రచించి ఈటెల రాజేందర్ వద్ద పెట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని ఆయన కోసమే నిలబెట్టింది అనే వ్యాఖ్యలు కూడా కొన్ని రోజులనుంచి వినబడుతున్నాయి. ఇక ఈటెల రాజేందర్ కు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఆయన పోస్టర్లు, బ్యానర్లు రూపంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో గట్టిగానే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలకు లేఖలు రాసి సొంత మనుషుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయించారు.
Also Read : Badvel Bypoll – గెలుపోటమలుపై కాదు.. వైసీపీ మెజారిటీపైనే చర్చ!
హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనను తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా ఈ ఆరోపణల విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆర్థికంగా కూడా ఈటెల రాజేందర్ కి సహాయ సహకారాలు అందిస్తున్నారు అని ప్రచారం కూడా జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తన సన్నిహితులతో కూడా ఆయన చర్చలు జరిపి ఈటెల రాజేందర్ కోసం సహకరించాలని కోరుతున్నారు అని అలాగే గతంలో ఈటెల రాజేందర్ తో కలిసి పనిచేసిన ఉద్యమ నాయకులను కూడా సంఘటితం చేసి ముందుకు నడిపిస్తున్నారు అని అంటున్నారు.
నిన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అనవసర ఆరోపణలు చేసి ఈటెల రాజేందర్ ను బయటకు పంపించారని మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు అందరికీ ఈటెల రాజేందర్ గెలవాలని ఉందని తాను కూడా ఈటెల రాజేందర్ గెలవాలని కోరుకుంటున్నా అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోతుందనే దానిపై కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక లెక్క బయటపెట్టారు. 40 వేల ఓట్ల తేడాతో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని అందుకే కెసిఆర్ రాలేదని కొండా కామెంట్ చేశారు.
Also Read : BJP Wanted Agents – బద్వేలు ఉప ఎన్నిక – పోలింగ్ ఏజెంట్లు కావలెను..!
అయితే ఈటెల రాజేందర్ కోసం కొండా విశ్వేశ్వర్ రెడ్డి సర్వే చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తన సర్వే టీం తో గత నెలలో రెండు సార్లు ఈ నెలలో మూడు సార్లు ఆయన సర్వే చేయించారు అని, ప్రతి అంశం మీద కూడా సామాజిక వర్గం లెక్కల ప్రకారం ఆయన సర్వే నిర్వహించారని, ఈ సర్వేలో అన్నింటిలో కూడా ఈటెల రాజేందర్ పైచేయి సాధించారని తెలుస్తోంది. ఒక సందర్భంలో ఈటెల రాజేందర్ ఓడిపోయే వరకు పరిస్థితి వెళ్లింది అని కానీ ప్రచారంలో ఆయన పుంజుకోవడంతో మళ్లీ గెలుస్తారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఆయన లెక్క ప్రకారం ఈటెల రాజేందర్ 30 నుంచి 38 వేల ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని లెక్కలు వేసుకున్నట్లు సమాచారం.