iDreamPost
android-app
ios-app

వెంకీ మిస్ చేసుకోవడం ప్లస్సా మైనస్సా

  • Published Jan 13, 2021 | 5:41 AM Updated Updated Jan 13, 2021 | 5:41 AM
వెంకీ మిస్ చేసుకోవడం ప్లస్సా మైనస్సా

అనవసరంగా పోటీకి దిగి ఇబ్బంది పడటం ఇష్టం లేక 9నే అడ్వాన్స్ రిలీజ్ అయిపోయి ప్రయోజనం పొందిన రవితేజ క్రాక్ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఈ రోజు మాస్టర్, రేపు రెడ్- అల్లుడు అదుర్స్ ఉంటున్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. వాటికొచ్చే టాక్ మీదే క్రాక్ వసూళ్లు తగ్గుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికీ కథ దర్శకుడు గోపిచంద్ మలిలేని ముందు చెప్పింది వెంకటేష్ కే నట. కానీ లైన్ రొటీన్ గా అనిపించడంతో పాటు ఇంకేవో కారణాల వల్ల వెంకీ నో చెప్పాకే రవితేజ దగ్గరకు వెళ్లిందని సదరు వార్తల సారాంశం.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వెంకటేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే క్రాక్ లాంటి ఫార్ములా కథలు రవితేజ లాంటి హీరోలకే బాగా సూట్ అవుతాయి. ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. పైగా వెంకీకి వెండితెర ఖాకీ డ్రెస్సు అంతగా అచ్చి రాలేదు. ఘర్షణ సూపర్ హిట్ అయినప్పటికీ అది మరీ అద్భుతాలు చేసిన బ్లాక్ బస్టర్ అయితే కాదు. సూపర్ పోలీస్ రూపంలో ఓ డిజాస్టర్ ఉంది. సూర్య ఐపిఎస్ కూడా పెద్దగా ఆడలేదు. బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. అందుకే తమ హీరోకి డిపార్మెంట్ కథలు అంతగా అచ్చిరాలేదని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఈ లెక్కన ఇదీ మంచికే అనుకోవాలి.

దీని సంగతి ఎలా ఉన్న క్రాక్ పుణ్యమాని గోపిచంద్ మలినేని మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. సాయి తేజ్ తో తీసిన విన్నర్ డిజాస్టర్ తర్వాత నాలుగేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న గోపిచంద్ సరైన టైంలోనే హిట్టు కొట్టాడు. దీని వల్లే ఇప్పుడు బాలకృష్ణ ప్రాజెక్ట్ గురించి టాక్ వినిపిస్తోంది. గతంలోనే ఓ కథను వినిపించారని పెండింగ్ పెట్టిన బాలయ్య దాన్ని ఓకే చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే గోపిచంద్ మాత్రం ఇంకా కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమి మాట్లాడ్డం లేదు. క్రాక్ తాలూకు విజయనుభూతిని పూర్తిగా ఆస్వాదించాకే నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టబోతున్నాడు దీనికే సీక్వెల్ ఉండొచ్చంటున్నారు కానీ పట్టాలెక్కే దాకా నమ్మలేం