Idream media
Idream media
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా తన ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ను సిద్ధూ ఆహ్వానించడం, దానికి అమరేందర్ సింగ్ హాజరవడం చూసిన వారంతా వీరి మధ్య విభేదాలు సమసిపోయినట్టేనని భావించారు. కానీ.. తాజా పరిస్థితులను చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఇటీవల అమరేందర్ సింగ్ మళ్ళీ ఢిల్లీ బాట పట్టడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి సిద్ధూ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారన్న వార్తలే ఇందుకు నిదర్శనం. డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని స్వయారా పీసీసీ చీఫ్ గా ఉన్న సిద్ధూనే ఆరోపణలు చేయడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్న తగువుల పంచాయితీ ఎటు దారి తీస్తుందనే చర్చ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలతో పాటు పంజాబ్ లో కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర నాయకులు సమష్టిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాల్సింది పోయి.. ఆరోపణలు, ఫిర్యాదులు కొనసాగిస్తుండడం పార్టీకి నష్టమే. కాంగ్రెసు చేతిలోంచి పుదుచ్చేరి జారిపోయాక ప్రస్తుతం మిగిలినవి మూడే రాష్ట్రాలు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్. వీటిలో రాజస్థాన్ లో కూడా పార్టీ పరిస్థితి మెరుగ్గా లేదు. పంజాబ్ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బలపడుతూ ప్రజల్లో పేరు పొందుతున్నాడన్న సమయానికి ఇటువంటి వివాదాలు తెరపైకి రావడం కాంగ్రెస్ లో సాధారణంగా మారింది. పంజాబ్, రాజస్థాన్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు అసమ్మతి వెళ్లగక్కుతూనే ఉన్నారు.
ఇక పంజాయ్ విషయానికి వస్తే.. అమరీందర్ సొంత రాజకీయాలతో నెగ్గి పార్టీతో సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఆయనపై రాహుల్ గుర్రుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సిద్ధూ స్వరం పెంచారని, ఆయనకు రాహుల్ , ప్రియాంకల మద్దతు ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అమరేందర్ ను ఎలాగైనా తప్పించాలనే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అమరీందర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. 2004లో కాంగ్రెసు నెగ్గాక, పంజాబ్ కాంగ్రెసు నాయకులు కొందరు అమరీందర్‌పై సోనియాకు ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఆ తర్వాత అమరేందర్ వెళ్లి సోనియాను కలిశాడు. అహ్మద్ పటేల్, మన్‌మోహన్ సింగ్ అమరీందర్‌కు బాసటగా నిలిచారు. ఆ సమయంలో అసమ్మతివాదులను సోనియా కట్టడి చేశారు.
2007 అసెంబ్లీ ఎన్నికలలో అమరేందర్ ప్రభుత్వం ఓడిపోయి అకాలీదళ్-బిజెపి ప్రభుత్వం వచ్చింది. వారి పరిపాలన అరాచకంగా సాగడంతో రాష్ట్రప్రజల్లో అసంతృప్తి పెరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చాడు. కానీ రాహుల్‌కి, ప్రియాంకా నవజ్యోత్ సింగ్ సిద్దూపై ఆసక్తి కనబరిచారు. అతను కూడా అమరీందర్‌లాగానే పాటియాలా ప్రాంతానికి చెందిన జాట్ శిఖ్కు. 2004లో అమృతసర్ నుంచి బిజెపిలో ఎంపీగా నెగ్గాడు. ఓ కేసు వివాదంలో సిద్ధూ 2006 లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, 2007లో జరిగిన ఉపఎన్నికలో మళ్లీ నెగ్గాడు. 2016 వరకు వివిధ పదవుల్లో బీజేపీలో కొనసాగారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవినాశ్ రాయ్ తో ఏర్పడిన గొడవలు, తదితర వివాదాల కారణంగా సిద్ధూ బీజేపీకి రాజీనామా చేశారు. పంజాబీ యువతలో క్రేజ్ వుందని అనుకున్న రాహుల్ అతన్ని కాంగ్రెసులో చేర్చుకుని, 2017 అసెంబ్లీ ఎన్నికలలో అమృతసర్ (ఈస్ట్) నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
ఆ ఎన్నికల్లో అకాలీదళ్-బిజెపి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతతో పాటు అమరేందర్ అమరీందర్ ప్రశాంత కిశోర్‌ను సలహాదారుగా పెట్టుకుని, హైటెక్ పద్ధతుల్లో ప్రచారం సాగించారు. సోనియా, రాహుల్ బొమ్మలు పెట్టుకోకుండానే ‘కెప్టెన్‌దీ సర్కార్’ అనే నినాదంతో తనను తానే ప్రొజెక్టు చేసుకుంటూ ఎన్నికలలో పోరాడాడు, 83 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను గెలిపించాడు. అనంతరం అధిష్ఠానం ప్రమేయం లేకుండానే నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. అది రాహుల్‌కి నచ్చడం లేదనే ప్రచారం జరిగింది. ఇంతలో అమరేందర్ , సిద్ధూ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం, సిద్ధూ మంత్రిత్వ శాఖ మారడంతో మొదలైన విభేదాలు పార్టీలో తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో రాహుల్ – ప్రియాంకలు రంగంలోకి దిగి సిద్ధూకు బాసటగా నిలిచారు. మరోవైపు అధినేత్రి సోనియా గాంధీ అమరేందర్ సింగ్ తో కూడా చర్చించారు. అమరేందర్ ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ, సిద్ధూకు పీసీసీ చీఫ్ ఇచ్చేలా మధ్యే మార్గం ఆలోచించారు. అంతటితో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు.
పీసీసీ చీఫ్ గా అయ్యాక నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చండీగడ్ లోని పార్టీ ఆఫీసులోనే బెడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి కూడా ఇక్కడే ఉంటానని, కార్యకర్తల సమస్యలు తీర్చేందుకు యత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. మంత్రులు కూడా కనీసం మూడు గంటలు ఇక్కడ ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఇదంతా బాగానే ఉన్నా సిద్ధూ, సీఎం మధ్య విభేదాలు మళ్లీ మొదటికి రావడమే పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని సిద్దు ఆరోపిస్తున్నారు. 2018 లోనే ఈ కేసులు వెలుగులోకి వచ్చినా వారిపై ఏ చర్య తీసుకున్నారో తెలియడంలేదని, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ రిపోర్టులు బయట పెట్టకపోతే తానే అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెడతానని ఆయన హెచ్చరించారు.
సిద్ధూ తాజా వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయంటూ అమరేందర్ సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ లో కాంగ్రెస్ విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ కూడా పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటి నుంచో కాచుకుని ఉంది. అయితే, నూతన వ్యవసాయ చట్టాలు బీజేపీకి శరాఘాతంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సమష్టిగా పని చేయాల్సిందిపోయి.. అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ను కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా, చేజార్చుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.