iDreamPost
android-app
ios-app

రేవంత్‌ లెక్క కరెక్టేనా..?

రేవంత్‌ లెక్క కరెక్టేనా..?

పరుగు పందెంలో గెలిచేది ఒక్కరే అయినా.. పది మంది పాల్గొంటారు. ఎవరికి వారు తామే గెలుస్తామనే నమ్మకం, ఆశ ఉంటుంది కాబట్టే.. బరిలో దిగుతారు. రాజకీయాల్లోనూ ఇంతే. ఆయా రాజకీయ పార్టీల నేతలు తామే గెలుస్తామనే ఆశతో, అధికారంలోకి వస్తామనే నమ్మకంతో రాజకీయాలు చేస్తుంటారు. అందుకు రకరకాల కారణాలు, థియరీలు ఆయా నేతలు చెబుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్యక్షుడుగా ఎన్నికైన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి కూడా.. సగటు రాజకీయ నేత మాదిరిగానే గెలుపు, అధికారంపై నమ్మకంతో ఉన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి ఎలా వస్తుందనేందుకు.. రేవంత్‌ రెడ్డి ఓ థియరీ చెబుతున్నారు. 1994 నుంచి పదేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటే.. 2004 నుంచి కాంగ్రెస్‌ పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. 2014 నుంచి టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. టీఆర్‌ఎస్‌ 2023 వరకు అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వస్తుంది. ప్రజలు ఇప్పటికే డిసైడ్‌ అయ్యారని చెబుతున్నారు రేవంత్‌ రెడ్డి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని రేవంత్‌ ధీమాగా ఉన్నారు.

Also Read : సీనియర్లను ప్రసన్నం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి

ప్రతి పదేళ్లకు అధికారం మారుతుందనేది రేవంత్‌ రెడ్డి థియరీ. కాబట్టి ఈ సారి కూడా అదే రిపీట్‌ అవుతుందని రేవంత్‌ ఆశిస్తున్నారు. పదేళ్లు, రెండు టర్మ్‌ల పాటు చేసిన పార్టీని ప్రజలు దించేస్తారనే భావనలో రేవంత్‌ ఉన్నారు. అయితే రేవంత్‌ లెక్క ఎంత వరకు కరెక్ట్‌..? అంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లు వరుసగా రెండు టెర్మ్‌లు, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి.. రాజకీయ సమీకరణాలు మారాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌లు అధికారంలోకి వచ్చాయి. మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలో కోల్పోయింది. తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంది. మునుపటి కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. రేవంత్‌ చెప్పిన రెండు టర్మ్‌లు, పదేళ్ల అధికారం థియరీ నిజమే అయితే.. ఏపీలోనూ 2019లో చంద్రబాబు మళ్లీ గెలిచేవారు. కానీ వైసీపీ చేతిలో ఘోరాతిఘోరంగా ఓడిపోయారు. ఈ విషయాన్ని రేవంత్‌ పరిగణలోకి తీసుకోనట్లుగా ఉంది.

ఓ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా.. ప్రజల మన్ననలను పొందాలి. ప్రజలు మెచ్చేలా, నచ్చేలా పాలన సాగించాలి. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో మిళితం చేస్తూ.. పాలన చేయాలి. ఒక పార్టీ ఐదేళ్లకు అధికారం కోల్పోతే.. మరో పార్టీ వరుసగా గెలిచిన సందర్భాలు దేశంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో జ్యోతి బసు, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌లు ఈ కోవలోకి వస్తారు. ఆయా పార్టీల ప్రభుత్వం పాలన ఎలా చేసింది.. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారు. అంతేగానీ పదేళ్లు అయితే అధికారం మారిపోతుందనే అంచనా సరైనది కాదు. ఈ గణాంకాలు ఎలా ఉన్నా.. రేవంత్‌ రెడ్డి లెక్క.. కరెక్ట్‌ అవుతుందా..? కాదా..? అనేది తేలాలంటే 2023 వరకు ఆగాలి.

Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్‌ రెడ్డికి తిరుగులేనట్లే..!