iDreamPost
android-app
ios-app

ఉత్త‌రాఖండ్ లో బీజేపీ వ్యూహాలు ఫ‌లిస్తాయా?

ఉత్త‌రాఖండ్ లో బీజేపీ వ్యూహాలు ఫ‌లిస్తాయా?

ముఖ్య‌మంత్రుల మార్పు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వంటి చ‌ర్య‌ల ద్వారా ఉత్త‌రాఖండ్ లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రానుందా? వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ఆ పార్టీ చేస్తున్న వ్యూహాలు ఫ‌లిస్తాయా? అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ లోని కీల‌క నేత‌ల‌కు గాలం వేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు షాక్ ఇస్తున్న బీజేపీ మున్ముందు మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది. పురోలా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ బీజేపీలో చేరుతూ.. మ‌రింత మంది కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. దీంతో బీజేపీ గ‌ట్టిగానే ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో విబేధాలు రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో పాటు పార్టీ పాత నాయకులను కూడా తిరిగి చేర్చుకుంటోంది. వ‌రుస‌గా ముఖ్య‌మంత్రుల‌ను మార్చ‌డం ఇప్ప‌టికీ అక్క‌డ చ‌ర్చనీయాంశంగానే మారింది. సుమారు 4 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నుంచి అధికారపగ్గాలు చేపట్టిన తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంత‌రం తీరత్‌ సింగ్‌ స్థానంలో పుష్కర్‌ సింగ్ ధామిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినప్పటికీ అసలు ఆయనను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తీరత్‌ సింగ్ ను త‌ప్పించ‌డానికి ముందు బీజేపీ భారీగానే స్థానిక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన‌ట్లు అర్థం అవుతోంది.

Also Read : పెగాసస్‌ కేంద్రం మెడకు చుట్టుకోబోతోందా..?సుప్రీం ఇంట్రీమ్ ఆర్డర్ ?

వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం మరోసారి అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే అక్కడ ఉన్న సాధువులు, పూజారులు, వారి భక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన గత్యంతర పరిస్థితి ఉంది. అందువల్లే ఆ స్థానంలో పుష్కర్‌ సింగ్ ను కూర్చోబెట్టింది. ఎన్నికల్లోగా పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతికూలతలను దూరం చేయడంలో తీరత్‌ సింగ్‌ వైఫల్యం చెందడంతో పాటు, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

తీరత్‌ సింగ్‌ను కొనసాగించడానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోగా ఎలాంటి ఉప ఎన్నికలను నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టత ఇవ్వడంతో ఆయనతో రాజీనామా చేయించారని తీరత్‌ సన్నిహితులు తెలిపారు. కానీ, కమలదళంలో అంతర్గత విబేధాలు, ఫిర్యాదులు, అసంతృప్తి కారణంగానే తీరత్‌ను పక్కనబెట్టారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే పార్టీ హైకమాండ్‌ సమాలోచనలు జరిపి ప్రజల్లో సరళమైన ఇమేజ్‌ ఉన్న పుష్కర్‌ సింగ్ ధామీని ఎంపిక చేసింది. ఇక ముఖ్య‌మంత్రుల మార్పు ఎపిసోడ్ కొలిక్కిరావ‌డంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెర తీసింది.

Also Read : వరుస మార్పుల వెనుక బీజేపీ వ్యూహం ఏమిటీ, మోడీ కొత్త ఎత్తుల ఫలితాలు ఎలా ఉంటాయో?

గవర్నర్ గా రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్య క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారని విస్తృత ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. ఈ ఊహించని పరిణామంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ… అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బీజేపీ పని చేస్తోంది. కానీ కాంగ్రెస్ స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుంచి బడుగు, బలహీనవర్గాలను సబ్సిడీలపై ఆధారపడి బతికేలా చేసింది. ఉత్తరాఖండ్‌లో మెరుగైన పాలనను చూసి బీజేపీలో చేరా. మ‌రింత మంది వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.