iDreamPost
iDreamPost
ఆచార్య షూటింగ్ నుంచి లాక్ డౌన్ బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టుగా సమాచారం. వీడియో కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు టీమ్ టచ్ లోనే ఉన్నారట చిరు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్రకు హీరోయిన్ కానీ పాటలు కానీ ఏవీ ఉండవు. పైపెచ్చు ఆ రోల్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎక్కడా పొరపాటున కూడా నవ్వదు. మరీ అంత అతి గంభీరంగా ఉంటే మన ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే సందేహం యూనిట్ లోనూ ఉందట.
అందుకే దానికి అనుగుణంగా కీలకమైన మార్పులు జరుగుతున్నట్టు వినికిడి. అయితే మలయాళంలో లేని హీరోయిన్ ని ఇక్కడ సృష్టిస్తారా లేక జోడి లేకుండా ఆ పాత్రను అలాగే ఉంచేసి ఫీల్ పోకుండా చూపిస్తారా అనే దాని మీద ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి తన 150 సినిమాల కెరీర్ లో కథానాయకి లేకుండా ఎప్పుడూ నటించలేదు. అంత గ్యాప్ ఇచ్చి కం బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150లో కాజల్ అగర్వాల్, సైరాలో నయనతార మళ్ళీ ఇప్పుడు ఆచార్య కోసం కాజల్ ఇలా ట్రెండ్ కు తగ్గట్టు అమ్మడులను సెట్ చేసుకుంటున్నాడు కానీ ఈ విషయంలో రాజీ పడటం లేదు. మరి అసలు కథలోనే లేని హీరోయిన్ ని ఇప్పుడు చిరు కోసం ఎలా పుట్టిస్తారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒకవేళ అలా చేస్తే కెరీర్ లో మొదటిసారి ఆ రిస్క్ చేసినట్టు అవుతుంది. హీరోయిన్ లేనప్పుడు ఇక పాటలకు ఆస్కారం లేదు. లూసిఫర్ మూడు గంటలున్నా కేవలం రెండు పాటలు ఉంటాయి. ఒకటి జైలులో మరొకటి ఐటెం సాంగ్. కానీ తెలుగులో అలా చేస్తే కుదరదు. అలాంటప్పుడు ఫీల్ పోకుండా చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. సుజిత్ కు ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. మక్కికి మక్కి రీమేక్ అయితే చిక్కులుండవు కానీ ఇలా సున్నితమైన అంశాలను డీల్ చేసేటప్పుడే దర్శకుడి టాలెంట్ బయట పడుతుంది. మరి సుజిత్ ఈ వలయాన్ని ఎలా చేధిస్తాడో చూడాలి.